Hyderabad Literary Festival: హైదరాబాద్‌ సాహిత్యోత్సవం.. ప్రత్యేకతలు ఇవే

19 Jan, 2023 13:42 IST|Sakshi

తరలిరానున్న కవులు, కళాకారులు, మేధావులు

సాక్షి, హైదరాబాద్: వైవిధ్యభరితమైన హైదరాబాద్‌ సాహితీ ఉత్సవం (హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌) 13వ ఎడిషన్‌కు నగరం సన్నద్ధమవుతోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యారణ్య స్కూల్‌ వేదికగా వేడుకలు జరగనున్నాయి. కోవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు హెచ్‌ఎల్‌ఎఫ్‌ ఏర్పాట్లు  పూర్తి చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న కళలు, సాహిత్యం, సంస్కృతులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రతి సంవత్సరం హైదరాబాద్‌ సాహిత్యోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

2010 నుంచి నిరాటంకంగా (కోవిడ్‌ కాలం మినహా) జరుగుతున్న లిటరరీ ఫెస్టివల్‌ అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యాన్ని గడించింది. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు, భిన్న భావజాలాలు, విభిన్న జీవన సమూహాలను ప్రతిబింబించే కళారూపాలకు, సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియలకు ఇది వేదికగా నిలిచింది. మూడు రోజుల పాటు సాహితీ ప్రియులను అక్కున చేర్చుకొని సమకాలీన సాహిత్య, సామాజిక అంశాలపై లోతైన చర్చలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.  

అతిథి దేశంగా జర్మనీ..  
హెచ్‌ఎల్‌ఎఫ్‌ 13వ ఎడిషన్‌కు జర్మనీ అతిథి దేశంగా హాజరు కానుంది. ఆ దేశానికి చెందిన పలువురు రచయితలు, మేధావులు భాగస్వాములు కానున్నారు. ప్రముఖ జర్మనీ  యువ నవలా రచయిత్రి ఎవేన్‌కో బుక్కోసీ ఈ వేడుకల్లో  పాల్గొంటారు. జర్మనీ కళారూపాలను ప్రదర్శించనున్నారు.  

కొంకణి సాహిత్యం ఎంపిక.. 
ఈ ఏడాది కొంకణి భాషా సాహిత్యాన్ని భారతీయ భాషగా ఎంపిక చేశారు. గతేడాది జ్ఞానపీఠ  అవార్డు  పొందిన కొంకణికి చెందిన ప్రముఖ రచయిత దామోదర్‌ మౌజో ఈ వేడుకల్లో  కీలకోపన్యాసం చేయనున్నారు. కొంకణి భాషా చిత్రాల దర్శకుడు బార్డ్‌రాయ్‌బరెక్టో పాల్గొంటారు. కొంకణి నృత్యాలు, జానపద కళలను ప్రదర్శించనున్నారు. 

ప్రముఖుల ప్రసంగాలు 
ప్రఖ్యాత దర్శకుడు దీప్తీ నవల్, ప్రముఖ పాత్రికేయుడు, రచయిత పాలగుమ్మి సాయినాథ్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మానస ఎండ్లూరి, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ నుంచి  గీతా రామస్వామి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తదితరులు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. జర్మనీతో పాటు అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన రచయితలు, కళాకారులు, దేశంలోని  వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మందికి పైగా ప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారు. వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ చారిత్ర వైభవాన్ని, వాస్తు నైపుణ్యాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉషా ఆకెళ్ల రూపొందించిన ‘హమ్‌ ఐసీ బాత్‌’ అనే పుస్తకాన్ని  ఆవిష్కరించనున్నారు.  


ఇది అందరి వేడుక: ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌
 
హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ఈసారి మెట్రో రైల్‌ ప్రత్యేక ప్రచారం నిర్వహించనుంది. ఖైరతాబాద్‌ నుంచి విద్యారణ్య స్కూల్‌ వరకు మూడు రోజుల పాటు ప్రతి 15 నిమిషాలకో ఉచిత ట్రిప్పును ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ప్రెస్‌ – పిక్చర్‌ – ప్లాట్‌ఫాం!)

మరిన్ని వార్తలు