8 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స 

1 Jul, 2022 20:05 IST|Sakshi
చిన్నారి తల్లి ప్రేమలతను అభినందిస్తున్న వైద్యుల బృందం

కూతురికి అవయవ దానం చేసిన కన్నతల్లి

అమర్చిన ఉస్మానియా, నిలోఫర్‌ వైద్యులు

దేశంలోనే తొలిసారి.. ప్రపంచంలో నాలుగోది 

సాక్షి, హైదరాబాద్‌: నవమాసాలు మోసి.. పురిటి నొప్పులతో తల్లడిల్లి.. కూతురికి జన్మనిచ్చిన ఆ తల్లి.. చావుబతుకుల్లో ఉన్న పేగుబంధానికి తన కాలేయాన్ని దానం చేసి మరోసారి ఆమె పునర్జన్మనిచ్చింది. ఉస్మానియా, నిలోఫర్‌ వైద్యుల బృందం ఎనిమిది నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే నాలుగోది కాగా దేశంలోనే మొదటిదని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీహెచ్‌ మధుసూదన్‌ వెల్లడించారు. 

జగిత్యాల జిల్లాకు చెందిన ప్రేమలత అంగన్‌వాడీ వర్కర్‌. భర్త నారాయణ కూలీ పనులు చేస్తుంటారు. వీరిది మేనరికపు వివాహం. గతంలో ఈ దంపతులకు జన్మించిన తొలి బిడ్డ కాలేయ సంబంధిత వ్యాధితో మరణించింది. వీరి రెండో కూతురు ఎనిమిది నెలల చిన్నారి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. నిలోఫర్‌ ఆస్పత్రిలో చూపించగా కాలేయ సంబంధిత వ్యాధి ఉన్నట్లు గుర్తించి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్య పరీక్షలు చేసిన ఉస్మానియా సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మధుసూదన్, చిన్నారికి కాలేయ మార్పిడి అవసరమని నిర్ధారించారు. తల్లి కాలేయం నుంచి కొంత భాగాన్ని సేకరించి గత నెల 17న దాదాపు 18 గంటల పాటు శ్రమించి చిన్నారికి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. 

సాధారణంగా మేనరికపు పెళ్లి, అనువంశికంగా ఇలాంటి జన్యుపరమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయని వైద్యులు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ డాక్టర్‌ రమేష్‌ రెడ్డి సహకారంతోనే చిన్నారికి కాలేయ మార్పిడి చేసినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ అభినందించారు. బిడ్డ కోసం కాలేయ దానం చేసిన తల్లి ప్రేమలతను వైద్యులు సన్మానించారు. (క్లిక్‌: ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ లేఖ..)

మరిన్ని వార్తలు