హైదరాబాద్‌: ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులు రద్దు!

14 Aug, 2021 08:22 IST|Sakshi

ముందస్తు సమాచారం లేక దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల పడిగాపులు

స్పందించని ఆర్టీసీ కాల్‌సెంటర్‌లు

ఆదరణ లేకపోవడం వల్లేనా...

సాక్షి,  హైదరాబాద్‌: అమీర్‌పేట్‌కు చెందిన నగేష్‌ ఈ నెల 12వ తేదీన విజయవాడకు వెళ్లేందుకు ఆర్టీసీ గరుడప్లస్‌ బస్సు (1402) కోసం అడ్వాన్స్‌గా రిజర్వేషన్‌ బుక్‌ చేసుకున్నాడు. ఉదయం 5.50 గంటలకు ఎస్సార్‌నగర్‌ నుంచి బస్సు బయలుదేరవలసిన సమయాని కంటే అరగంట ముందే చేరుకున్నాడు. కానీ  ఉదయం 8.15 గంటల వరకు కూడా బస్సు రాలేదు. పైగా బస్సు రద్దయినట్లు ఎలాంటి సమాచారం లేదు. అసలు వస్తుందో, రాదో కూడా తెలియలేదు. టీఎస్‌ఆర్టీసా కాల్‌సెంటర్‌ను సంప్రదించాడు. ఎలాంటి స్పందన లేదు.

చివరకు రెండు గంటల తరవాత ఆర్టీసీ బీహెచ్‌ఈఎల్‌ డిపోకు చెందిన అధికారులు సదరు బస్సు రద్దయినట్లు తాపీగా సెలవిచ్చారు. కానీ ఆ  బస్సు కోసం ఉదయం నాలుగున్నరకే పాయింట్‌కు చేరుకున్ననగేష్‌ మాత్రం 8 గంటల వరకు అంటే మూడున్నర గంటల పాటు ఆందోళనగా ఎదురు చూడవలసి వచ్చింది. ఇది ఒక్క నగేశ్‌కు ఎదురైన సమస్య మాత్రమే కాదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా రద్దవుతున్న దూరప్రాంత బస్సుల వల్ల అప్పటికప్పుడు మరో బస్సులో వెళ్లేందుకు అవకాశం లేక ప్రయాణికులు తరచుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు మాత్రం ప్రైవేట్‌ వాహనాల్లో పెద్ద మొత్తం చెల్లించవలసి వస్తోంది.
 
నిర్వహణలో సమన్వయ లోపం... 
బస్సుల నిర్వహణలో సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు  పడిగాపులు కాయాల్సి వస్తోంది. సాంకేతిక కారణాల వల్ల  బస్సులు రద్దయితే ఆ సమాచారాన్ని ప్రయాణికులకు ముందే చేరవేయాలి. మరో బస్సు అందుబాటులో ఉంటే  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి ఉదయం నాలుగున్నర గంటలకు బయలేదేరవలసిన గరుడ ప్లస్‌ బస్సు ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల  బస్సు రద్దయినట్లు  అధికారులు  తెలిపారు.

కానీ ప్రయాణికులకు ఆ సమాచారం అందజేయడంలో తమ సిబ్బంది విఫలమైనట్లు  డివిజనల్‌ మేనేజర్‌ అధికారి ఒకరు  పేర్కొన్నారు. దీంతో ఒక్క ఎస్సార్‌ నగర్‌ నుంచి బయలుదేరే ప్రయాణికులే కాకుండా కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్, లకిడికాపుల్, ఎల్‌బీనగర్‌, తదితర ప్రాంతాల్లో  అదే బస్సు కోసం ఎదురు చూస్తున్న వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. ‘ఆర్టీసీ  అధికారుల నిర్వాకం వల్ల ముఖ్యమైన కార్యక్రమానికి హాజరుకాలేకపోయాను. ఇది చాలా దారుణం’. అని నగేశ్‌ విస్మయం వ్యక్తం చేశారు.  

ఆదరణ లేకపోవడమే కారణమా... 
► సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దవుతున్నట్లు అధికారులు పైకి చెబుతున్నప్పటికీ  ఏసీ బస్సులకు ఆదరణ లేకపోవడం వల్లనే అప్పటికప్పుడు రద్దు చేస్తున్నట్లు తెలిసింది. 
► ఏసీ  బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి  దూరప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు వెనుకంజ వేస్తున్నారు. ఏసీ వల్ల  కోవిడ్‌ వ్యాపిస్తుందేమోననే ఆందోళన ఇందుకు  కారణం. 
►దీంతో కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో బస్సులను రద్దు చేసుకోవలసి వస్తున్నట్లు  ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. కానీ అదే సమాచారాన్ని ముందస్తుగానే  ప్రయాణికులకు తెలియజేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించకపోవడం ఆర్టీసీ అధికారులు బాధ్యతారాహిత్యాన్ని ప్రతిబింబిస్తోంది.  

పనిచేయని కాల్‌ సెంటర్‌
► ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఎప్పటికప్పుడు బస్సు సమాచారం తెలుసుకొనేందుకు ఆర్టీసీ కాల్‌సెంటర్‌లను ఏర్పాటు చేసింది. 
► ఆర్టీసీ కాల్‌సెంటర్‌ నెంబర్లు : 040–30102829,  040–68153333 
► ఈ కాల్‌సెంటర్‌లు  ఇరువైనాలుగు గంటలు ప్రయాణికులకు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదులను స్వీకరించాలి. ఎప్పటికప్పుడు తగిన సమాచారం ఇవ్వాలి. 
►  కానీ అందుకు విరుద్ధంగా ఫోన్‌ చేసినా ఎలాంటి సమాచారం లభించడం లేదని, స్పందన కరువవుతుందని  ప్రయాణికులలు పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు