ఫ్లాట్‌ కొంటున్నారా? అదనపు వసూళ్లు తప్పడం లేదా? రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయి

22 Feb, 2022 07:53 IST|Sakshi

క్లబ్‌హౌస్, స్క్వాష్‌ కోర్ట్, టేబుల్‌ టెన్నిస్‌.. అన్నింటికీ వసూళ్లే

ఓపెన్‌ ప్లాట్‌లోనూ వసతులు కల్పిస్తామని మాయమాటలు

వీకెండ్‌ రిసార్ట్, క్లబ్‌హౌస్‌ సభ్యత్వం పేరిట రూ.లక్షల్లో చార్జీలు

ఓసీ రాకముందు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం

నివాసితులకు భారంగా మారిన క్లబ్‌హౌస్‌ల నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు ఎంత వ్యయమవుతోందో.. అదే స్థాయిలో వసతుల చార్జీలూ తడిసిమోపెడవుతున్నాయి. క్లబ్‌హౌస్, పార్కింగ్, సెలబ్రిటీ జిమ్, స్విమ్మింగ్‌ పూల్, స్వా్కష్‌ కోర్ట్, టేబుల్‌ టెన్నిస్, క్రికెట్‌ పిచ్, బ్యాడ్మింటన్‌ కోర్ట్, ఇండోర్‌ గేమ్స్, చిల్డ్రన్‌ పార్క్, జాగింగ్, వాకింగ్‌ ట్రాక్స్, యోగా, మెడిటేషన్‌ హాల్, గెస్ట్‌ రూమ్స్, 7 స్టార్‌ రెస్టారెంట్‌.. ఇలా బోలెడన్నీ వసతులను ప్రకటిస్తున్నారు. అన్నింటికీ రూ.లక్షల్లోనే చార్జీలను వసూలు చేస్తున్నారు. రెరా నిబంధనల ప్రకారం అపార్ట్‌మెంట్‌ ధరలోనే వసతుల చార్జీలు కూడా కలిపి ఉండాలి. కానీ, నిర్మాణ సంస్థలు వేర్వేరుగా వసూలు చేస్తున్నాయి. 

ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్స్, గ్రీనరీ, పైప్‌డ్‌ గ్యాస్, విద్యుత్, తాగునీరు ఇలా కనీస మౌలిక వసతులకు కూడా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రెండేళ్ల పాటు క్లబ్‌హౌస్‌ నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రకటిస్తూనే.. మరోవైపు సభ్వత్య రుసుము పేరిట రూ.2– 3 లక్షల వరకూ బాదుతున్నారు.
చదవండి: గీతం పూర్వ విద్యార్థిని శివాలి మరో గిన్నిస్‌ రికార్డు

ఓసీ రాకముందే వసూళ్లు.. 
► ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) రాకముందు వసతుల ఏర్పాటు, నిర్వహణకు చార్జీలు వసూలు చేయకూడదనేది నిబంధన. నిర్మాణ సంస్థలు మాత్రం దీన్ని పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ విభాగాలు సైతం నియంత్రించడంలేదు.  
► మౌలిక వసతులను కల్పించిన తర్వాతే మున్సిపల్‌ విభాగం ఓసీని విడుదల చేయాల్సి ఉంటుంది. స్విమ్మింగ్‌ పూల్, జిమ్, ఇండోర్‌ గేమ్స్, జాగింగ్, వాకింగ్‌ ట్రాక్స్‌.. అంటూ కొనుగోలుదారుకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వసతులను పర్యవేక్షించే వారే కరువయ్యారు.  
► భౌతికంగా ఆయా వసతులను డెవలపర్‌ కల్పించాడా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారే లేరు. ఒక్కసారి ఓసీ రిలీజ్‌ అయ్యాక ఇక ఆ అపార్ట్‌మెంట్‌కు డెవలపర్‌కు సంబంధం 
ఉండదు.  

వెంచర్లలో రిసార్ట్‌ అంటూ..  
► ఓపెన్‌ ప్లాట్లు చేసే బిల్డర్లు అపార్ట్‌మెంట్లలో కల్పించే వసతులను వెంచర్లలోనూ కల్పిస్తామంటూ భారీగా వసూలు చేస్తున్నారు. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం వెంచర్లలో రహదా రులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్‌ వ్యవస్థ వంటివి కల్పించాల్సిన బాధ్యత డెవలపర్లదే. కానీ.. బిల్డర్లు వీటికి కూడా వసతుల ఏర్పాటు పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు.  
► వీకెండ్‌ రిసార్ట్, ఫార్మింగ్, గోల్ఫ్‌ కోర్స్, క్లబ్‌హౌస్‌ సభ్యత్వం అని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. శామీర్‌పేట, షాద్‌నగర్, తుక్కుగూడ, యాదాద్రి, చేవెళ్ల, శ్రీశైలం జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లోని వెంచర్లలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. 

ఇలా చేయొచ్చు.  
► అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పూర్తయ్యాక ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా రెండేళ్ల పాటు వసతుల నిర్వహణ నిర్మాణ సంస్థే భరించాలి. ఒకే ఏరియాలో ఉండే 3– 4 ప్రాజెక్ట్‌లకు ఒకే క్లబ్‌హౌస్‌ కట్టుకోవటం ఉత్తమం.  
► అపార్ట్‌మెంట్‌ నిర్వహణ ఖర్చులు చ.అ.ల చొప్పున కాకుండా నివాసితుందరికీ ఒకేలా ఉండాలి. ఫ్లాట్ల సంఖ్యను బట్టి చార్జీలను విభజించాలి.  
►హౌసింగ్‌ సొసైటీల్లోని క్లబ్‌హౌస్‌లను థర్డ్‌ పార్టీకి అప్పగించాలి. రెస్టారెంట్, సూపర్‌మార్కెట్, మెడికల్‌ వంటి ఇతరత్రా వాటికి అప్పగించాలి. ఆ అద్దెతో కమ్యూనిటీలో ఇతరత్రా ఖర్చులను వినియోగించుకోవచ్చు. 

ప్రచారంగా మారిన వసతులు  
కొనుగోలుదారులను ఆకర్షించాలంటే ఆధునిక వసతులనేవి అనివార్యం. పిల్లలు, యువత, పెద్దల కోసం వేర్వేరుగా వసతులకు ఎక్కువ స్థలం వదలాల్సి ఉంటుంది. ఆ స్థలం ధర, వసతుల కల్పనకు అయ్యే ఖర్చు అన్నింటినీ కొనుగోలుదారుల నుంచే వసూలు చేయాల్సి వస్తోంది. సౌకర్యాలతో పాటు ఇంటి విలువ కూడా పెరుగుతోంది. దీంతో అపార్ట్‌మెంట్‌ ధరలో 10– 15 శాతం వరకు వసతుల చార్జీలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ వసూలు చేయడం సరికాదు.
 – ప్రేమ్‌ కుమార్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, నరెడ్కో తెలంగాణ 


 
కార్పడ్‌ ఫండ్‌ లెక్కించడంలేదు.. 
పదేళ్ల క్రితం కాప్రాలో అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశాను. చ.అ.కు రూ.3 వేల చొప్పున 1,100 చ.అ.లకు రూ.33 లక్షలు అయింది. ఆ సమయంలో కార్పస్‌ ఫండ్, వసతుల నిర్వహణ కోసమని రూ.5 లక్షలు వసూలు చేశారు. ప్రతి నెలా అపార్ట్‌మెంట్‌ నిర్వహణ ఖర్చు కోసం నెలకు రూ.2 వేలు చెల్లిస్తున్నా. ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం ఆ ఫ్లాట్‌ను అమ్మేద్దామని నిర్ణయించుకున్నా. కొనడానికి ఎవరొచ్చినా సరే అపార్ట్‌మెంట్‌ ధరనే లెక్కిస్తున్నారే తప్ప.. నేను చెల్లించిన కార్పస్‌ ఫండ్‌ పరిగణనలోకి తీసుకోవటం లేదు. 
 – అజయ్, రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగి 

అదనంగా రూ.10లక్షలు చెల్లించా
స్విమ్మింగ్‌ పూల్, జిమ్, పిల్లలకు క్రచ్, ప్లే ఏరియా వంటివి ఉన్నాయని కూకట్‌పల్లిలో ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో రూ.80 లక్షలకు ఫ్లాట్‌ కొన్నా. వీటి కోసం డెవలపర్‌కు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాను. ప్రస్తుతం బెంగళూరుకు బదిలీ అయింది. అపార్ట్‌మెంట్‌ సొసైటీకి అప్పగించిన రెండేళ్ల తర్వాత సరైన నిర్వహణ లేక స్విమ్మింగ్‌ పూల్‌ పాడైపోయింది.
– ఉజ్వల్, ఐటీ ఉద్యోగి  

మరిన్ని వార్తలు