ఇతనో హైటెక్‌ రైతు.. కాంక్రీట్‌ జంగిల్‌లో ప్రకృతి వ్యవసాయం

22 Jul, 2021 08:34 IST|Sakshi

చుట్టూ కాలనీలు మధ్యలో పంట, పొలాల సాగు 

పండించిన చోటే విక్రయాలు

గ్రామం పట్టణంగా మారినా సేద్యం వదలని భూమి పుత్రుడు

ఒకప్పుడు నగర శివారుల్లో పంట, పొలాలు కనిపించేవి. రైతులు సాగు చేస్తూ కనిపించే వారు. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. రానురాను శివారు ప్రాంతాలు కాంక్రీట్‌ జంగిళ్లుగా మారుతూ ఉండటంతో అటు రైతులు.. ఇటు పొలాలు కనుమరుగవుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో... భూమి ధర తెలిసిన వాడు అమ్ముకుంటుంటే.. భూమి విలువ తెలిసిన వాడు సేద్యాన్ని నమ్ముకుంటున్నాడు. భూమి ధర మంచిగొస్తుంటే సేద్యం ఎవరు చేస్తారులే? అనే ప్రశ్న మనలో తలెత్తడం సర్వసాధారణం. కానీ ఓ రైతు సేద్యాన్నే నమ్ముకుని ఔరా అనిపిస్తున్నాడు. మరి కాలనీల మధ్యలో వ్యవసాయం చేస్తున్న ఆ రైతు ఎవరో తెలుసుకుందామా?

సాక్షి, మీర్‌పేట(హైదరాబాద్‌): గ్రామపంచాయితీ నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరం చెందినా.. చుట్టూ కాలనీలు వెలిసినా సేద్యంపై ఉన్న మక్కువతో కాంక్రీట్‌ జంగిల్‌ మధ్య వ్యవసాయం చేస్తున్నాడో రైతు. మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధి జిల్లెలగూడకు చెందిన సిద్దాల కొమురయ్య దాదాపు 45 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ప్రాంతం నగరానికి ఆనుకుని ఉండటం.. చుట్టూ కాలనీలు వెలిసినప్పటికీ వ్యవసాయాన్ని వదలకుండా తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో నేటికీ సేద్యం చేస్తుండడం విశేషం. వరితో పాటు పాలకుర, తోటకూర, వంకాయలు పండిస్తుంటాడు. ప్రస్తుతం ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో చామగడ్డ పంటను పండిస్తున్నాడు. 

సేద్యం, అమ్మకం ఒకేచోట.. 
►  సిద్దాల కొమురయ్య తాను పండించిన కూరగాయలు, ఆకు కూరలను పండించిన చోటే భార్య అంజమ్మతో కలిసి విక్రయిస్తుంటాడు. ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులతో కూరగాయలు, ఆకు కూరలను సాగు చేస్తుండటంతో కొనుగోలు చేసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. స్థానికులకు విక్రయించగా మిగిలిన వాటిని మాదన్నపేట మార్కెట్‌కు సరఫరా చేస్తామని కొమురయ్య తెలిపారు. నగర శివారు ప్రాంతాల్లో అర ఎకరం స్థలం ఉంటే ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకునే ఈ రోజుల్లో నగరానికి ఆనుకుని ఉన్న జిల్లెలగూడ ప్రాంతంలో విలువైన భూమి ఉన్నప్పటికీ కొమురయ్య ఇంకా వ్యవసాయం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నగర పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ చిట్టి వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చి సేద్యాన్ని పరిచయం చేయొచ్చని కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు.

వ్యవసాయంపై మక్కువతోనే.. 
తెలివి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. చుట్టూ కాలనీలు వెలిసినా సేద్యంపై మక్కువతో నాకున్న కొద్ది పాటి పొలంలో వ్యవసాయం చేస్తు న్నాను. కుటుంబ సభ్యుల సహకారంతో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నాను. ప్రస్తుతం ఒక ఎకరంలో వరిపంట, మరో ఎకరాలో చామగడ్డ, వంకాయ పంటలను సాగు చేస్తున్నాను. నాలుగు నెలల నుంచి సాగు చేస్తున్న చామగడ్డ పంట చేతికి వచ్చింది. నాలుగైదు రోజుల్లో కోతకోసి విక్రయిస్తాం.    
– సిద్దాల కొమురయ్య, రైతు, జిల్లెలగూడ    

మరిన్ని వార్తలు