విషాద ఘటన: దేశభక్తితో ప్రసంగిస్తూనే కుప్పకూలాడు

16 Aug, 2022 12:32 IST|Sakshi

పంద్రాగస్టు వేడుకల్లో విషాదం 

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. దేశభక్తితో తండ్రి ప్రసంగిస్తుండగా, అతడిని వీడియోలో బంధిస్తున్న కూతురు. చుట్టూ పండుగ వాతవరణం. అప్పటిదాకా కోలాహలంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. ప్రసంగిస్తున్న వ్యక్తి.. ఉన్నట్టుండి కుప్పకూలాడు. అందరూ చూస్తుండగానే మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన కాప్రా, వంపుగూడలో జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాప్రా డివిజన్‌ వంపుగూడ లక్ష్మీవిల్లాస్‌లో పంద్రాగస్టు వేడుకలను నిర్వహిస్తున్నారు. కాలనీ అసోసియేషన్‌ సభ్యుడైన ఉప్పల సురేశ్‌ కూతురు మైత్రితో కలిసి స్వాతంత్ర వేడుకలకు వచ్చాడు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతున్నాడు. స్వాతంత్య్రోద్యమ చర్రితను చెబుతూ.. కుప్పకూలిపోయాడు. గుండెపోటు వచ్చి కూతురు చూస్తుండగానే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. సురేష్‌ అకస్మాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. 

బాగ్‌అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో ఫార్మాస్యూటికల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సురేష్‌కు తల్లిదండ్రులు యాదగిరి, సరోజని, భార్య కరుణ, కూతురు మైత్రి, కొడుకు ధర్మపాల్‌ ఉన్నారు. తండ్రి యాదగిరి హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో ఉన్న వేదిక్‌ విద్యాలయ అధ్యక్షుడుగా ఉన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన యాదగిరి, కొడుకు మరణవార్త విని హుటాహుటిన ఇంటికి వచ్చాడు. విగతజీవిగా పడి ఉన్న కొడుకును చూసి ఆయన బోరున విలపించడం అందరిని కంటతడి పెట్టించింది. సురేశ్‌ కూతురు మైత్రి సీఏ చదువుతుండగా, కొడుకు ధర్మపాల్‌ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులను చూసేందుకు ధర్మపాల్‌ రెండ్రోజుల క్రితమే బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. (క్లిక్: హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం)

మరిన్ని వార్తలు