-

మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతదేహం లభ్యం

28 Sep, 2021 08:13 IST|Sakshi
వర్షపు నీటిలో నడుస్తూ నాలాలోకి జారుకున్న దృశ్యం(ఫైల్‌ఫోటో)

అనుమానితుడే మృతుడు

నెక్నాంపూర్‌ చెరువులో మృతదేహం లభ్యం

ఫలించిన గాలింపు

సాక్షి, హైదరాబాద్‌: మణికొండ: డ్రైనేజీ కాలువలో కొట్టుకు పోయిన వ్యక్తిని ఎట్టకేలకు గుర్తించారు. సంఘటనా స్థలానికి పక్కనే ఉండే బాబానివాస్‌ అపార్ట్‌మెంట్‌ నుంచి శనివారం రాత్రి బయటకు వచ్చిన గోపిశెట్టి రజనీకాంత్‌ (42)నే మృతుడిగా తేల్చారు. డ్రైనేజీ కాలువలో పడిన స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని నెక్నాంపూర్‌ చెరువు ప్రవేశంలో సోమవారం డీఆర్‌ఎఫ్‌ బృందం మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి అన్న, బావలు అతని చాతీపై ఉన్న ‘సప్పు’ అనే టాటూ గుర్తించి రజనీకాంత్‌గా నిర్ధారించారు. 35 గంటల పాటు మురుగునీటిలో ఉండటంతో శవం కుళ్లిపోయింది.

నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్, ఎస్సై రాములుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రజనీకాంత్‌ షాద్‌నగర్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కాగా, అతని భార్య స్వప్న హైటెక్‌ సిటీలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వస్థలం హైదరాబాద్‌ నగరంలోని రాంనగర్‌ కాగా మణికొండలో ఫ్లాట్‌ కొనుగోలు చేసి ఇక్కడ నివసిస్తున్నట్టు బంధువులు తెలిపారు. 
 
చేతిలో పెరుగు ప్యాకెట్‌తో... 
డ్రైనేజీ కాలువలో కొట్టుకుపోయిన రజనీకాంత్‌ చేతిలో పెరుగు ప్యాకెట్‌ను అలాగే పట్టుకుని ఉన్నాడు. శనివారం రాత్రి ఇంట్లోనుంచి బయటకు వచ్చి ఓ షాపులో పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేసి పక్కనే ఉన్న మరో షాపులో సిగరెట్‌ కొనుగోలు చేసేందుకు రోడ్డు దాటుతూ వరదనీటిలో పడిపోయారు. అతను దాటిన ప్రదేశంలో అంతకు ముందు మట్టి ఉండటం, వరదకు అది కొట్టుకుపోయిందని గమనించకుండా కాలుపెట్టడంతోనే సంఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.  

     

మరిన్ని వార్తలు