అసదుద్దీన్‌ ఫోన్‌ నంబర్‌ కోసం ముంబైలో ఆరా.. దేశవ్యాప్తంగా బాంబ్‌ బ్లాస్ట్‌ వార్నింగ్‌ 

26 Sep, 2022 07:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని చార్మినార్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఫోన్‌ నెంబర్‌ కోసం ముంబైలోని ఆ పార్టీ యాక్టివిస్ట్‌ను సంప్రదించాడు. అతడు తిరస్కరించడంతో దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లు చేస్తామంటూ బెదిరించాడు. ఈ వ్యవహారం అక్కడి శాంతాక్రుజ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్దకు వెళ్లడంతో కేసు నమోదై నగర వాసి అరెస్టు అయ్యాడు. దీన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ బాలాసాహెబ్‌ తాంబే సాక్షికి తెలిపారు.

చార్మినార్‌ ప్రాంతానికి చెందిన రంజిత్‌ కుమార్‌ వ్యాపారి. ఈయన సోషల్‌ మీడియా ద్వారా ముంబైలోని శాంత క్రుజ్‌ వాసి రఫత్‌ హుస్సేన్‌ ఫోన్‌ నెంబర్‌ సంగ్రహించాడు. గత మంగళవారం ఆయనకు వీడియో కాల్‌ చేసిన రంజిత్‌ తనకు ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్‌ ఓవైసీ ఫోన్‌ నెంబర్‌ కావాలంటూ అడిగాడు. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన రంజిత్‌ ముంబైలో ఉండే తనకు ఫోన్‌ చేసి అసదుద్దీన్‌ ఓవైసీ నెంబర్‌ అడగటంతో హుస్సేన్‌ అనుమానించారు. దీనికి తోడు తనకు రంజిత్‌తో పరిచయం లేకపోవడంతో ఫోన్‌ నెంబర్‌ ఇవ్వనంటూ స్పష్టం చేశాడు. దీంతో సహనం కోల్పోయిన రంజిత్‌ తీవ్ర స్థాయిలో వార్నింగ్‌ ఇచ్చాడు.

తాను అడిగిన ఫోన్‌ నెంబర్‌ ఇవ్వడానికి తిరస్కరించావని, ఫలితంగా బుధవారం (మరుసటి రోజు) దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లు తప్పవంటూ బెదిరించి ఫోన్‌ పెట్టేశాడు. ఈ పరిణామంతో కంగుతిన్న హుస్సేన్‌ విషయాన్ని అక్కడి క్రైమ్స్‌ విభాగం డీసీపీ బాల్‌సింగ్‌ రాజ్‌పుత్‌కు ఫిర్యాదు చేశారు. వస్త్ర వ్యాపారి అయిన హుస్సేన్‌ ఫిర్యాదు ఆధారంగా శాంతాక్రుజ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

గత గురువారం నగరానికి వచ్చిన ప్రత్యేక బృందం రంజిత్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లింది. శుక్రవారం అక్కడి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో రోజుల పోలీసు కస్టడీకి తీసుకుంది. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ బాలాసాహెబ్‌ తాంబే సాక్షితో మాట్లాడుతూ... ప్రాథమిక విచారణలో రంజిత్‌ తనకు అసదుద్దీన్‌ అంటే అభిమానమని, ఆయన్ని కలవడానికి అపాయింట్‌మెంట్‌ తీసుకోవడానికే ఫోన్‌ నెంబర్‌ అడిగానని చెప్పాడు. హుస్సేన్‌ తిరస్కరించడంతో పాటు నిర్లక్ష్యంగా మాట్లాడటంతోనే అలా వార్నింగ్‌ ఇచ్చానని వివరించాడు. రంజిత్‌ ఆకతాయి తనంతోనూ ఇలా చేశాడని అనుమానం ఉంది.  

మరిన్ని వార్తలు