కాల్చి చంపేస్తా.. భార్య, పిల్లలకు రివాల్వర్‌తో బెదిరింపులు 

23 Mar, 2022 08:01 IST|Sakshi
నిందితుడు అజయ్‌కుమార్‌, స్వాధీనం చేసుకున్న రివాల్వర్‌

మాజీ పీపీ అరెస్ట్‌ 

సాక్షి,,హైదరాబాద్‌: తాగిన మైకంలో భార్య పిల్లలను రివాల్వర్‌తో కాల్చి చంపేస్తానని బెదిరించిన మాజీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి  చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణానికి బానాల అజయ్‌కుమార్‌ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీబీఐ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను 2004 నుంచి 2010 వరకు హైకోర్టులో పీపీగా పని చేశాడు. 2002లో అతను రమాదేవిని వివాహం చేసకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. నాంపల్లి కోర్టులో పీపీగా పని చేస్తున్న సమయంలో అతను వ్యక్తిగత భద్రత కోసం గన్‌లైసెన్స్‌ తీసుకున్నాడు.

కొంతకాలంగా మద్యానికి బానిసైన అజయ్‌కుమార్‌ మద్యం మత్తులో భార్య, పిల్లలను వేధిస్తున్నాడు. ఈ నెల 19న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను కుమార్తె శారదను చంపేస్తానని నుదుటిపై రివాల్వర్‌ పెట్టి బెదిరించాడు. దీంతో అతడి భార్య రమాదేవి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రివాల్వర్, కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. రివాల్వర్‌ లైసెన్స్‌ను రాచకొండ సీపీ రద్దుచేసినట్లు సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు