మరో వివాదంలో హైదరాబాద్‌ మేయర్‌ 

20 Jul, 2021 06:48 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

పారిశుద్ధ్య కార్మికుల్ని అక్రమంగా తొలగించారంటూ ఆరోపణలు 

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సీపీఎం నగర శాఖ 

సాక్షి, సిటీబ్యూరో: మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి మరో వివాదంలో చిక్కుకున్నారు. తమ ఇంటిలో పని చేసే వారి కుటుంబీకులను నియమించేందుకు ఔట్‌ సోర్సింగ్‌పై పని చేస్తున్న ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులను తొలగించారంటూ సీపీఎం నగర శాఖ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ నగరశాఖ కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌ బాధితులతో కలిసి సోమవారం కమిషనర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంజగుట్ట ప్రాంతంలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు వి.భారతి, ఎల్‌.రమాదేవి, ఎస్‌ఎఫ్‌ఏ (శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌) సాయిబాబాలను తొలగించి మేయర్‌ ఇంట్లో పని చేసే వారి కుటుంబ సభ్యులను నియమిస్తూ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ జూన్‌ 22న ఉత్తర్వులు జారీ చేసినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

తొలగించిన కార్మికులను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 15 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న భారతి గత ఏప్రిల్‌ 20న కరోనా బారిన పడి ఖమ్మం ఆస్పత్రిలో చేరిందని, తోడుగా పారిశుద్ధ్య కార్మికురాలిగానే పని చేస్తున్న తన కుమార్తె రమాదేవిని తీసుకు వెళ్లిందని,  ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నాక మే 11న  డ్యూటికీ రాగా, వారిద్దరినీ  తొలగించామని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.

అప్పటి నుంచీ జీతం  ఇవ్వకపోయినా పనిచేస్తున్నారని, వారిని యథావిధిగా కొనసాగించడంతో పాటు విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంలో మేయర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. మేయర్‌ దగ్గర పని చేసేవారు కార్మికులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.  

వాట్సాప్‌లో వైరల్‌.. 
ఈ విషయం వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడినందున ఎస్‌ఎఫ్‌ఏ సాయిబాబాను, ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్‌ 20వ తేదీ వరకు అనధికారికంగా  గైర్హాజరైనందున రమాదేవి, భారతిలను విధుల నుంచి తొలగించినట్లు సంబంధిత జూబ్లీహిల్స్‌ డిప్యూటీ కమిషనర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. వారు విధులకు హాజరు కాకున్నా ఎస్‌ఎఫ్‌ఏ సాయిబాబా బయోమెట్రిక్‌లో అక్రమంగా హాజరు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ విషయంపై విచారణకు హాజరు కావాల్సిందిగా రెండుసార్లు నోటీసులు పంపినా హాజరుకాలేదని పేర్కొన్నారు. వీరి స్థానంలో ఎవరినీ నియమించలేదని తెలిపారు. సీపీఎం  కార్యదర్శి శ్రీనివాస్‌ కమిషనర్‌కు అందజేసిన వినతిపత్రంతో పాటు జత చేసిన   (జూన్‌ 22న జారీ అయినట్లుగా ఉన్న) ఉత్తర్వు ప్రతిలో రమాదేవి, భారతిల స్థానంలో వేరేవారిని నియమించినట్లు పేర్లున్నాయి. వారు మేయర్, ఆమె తండ్రి ఇంట్లో పని చేసే వారి కుటుంబీకులని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు