మేయర్‌ ప్రేమ కథ: ఒప్పించాం.. ఒక్కటయ్యాం

14 Feb, 2021 07:57 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.. ఒకరిపై ఒకరు నమ్మకం నిలుపుకోవాలి.. ఎన్నాళ్లయినా తరగనంత ప్రేమను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి.. అంటున్నారు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి. ఆమెది ప్రేమ వివాహమే.. అయితే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని.. ప్రేమకు ముందు ఏర్పడిన పరిచయం తమను ఇక్కడిదాకా తీసుకొచ్చిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన 
మనసులోని మాటను ఆమె వెల్లడించారు.

ఇద్దరమూ క్రీడాకారులమే..   
నేను క్రికెట్‌ ప్లేయర్‌ను. ఆయన బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌.. నేను క్రికెట్‌ ఆడుతున్నప్పుడు వచ్చి చూసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వెంగల్‌రావునగర్‌ ఇక్రిశాట్‌ క్లబ్‌లో ఇద్దరం కలిసి టెన్నిస్‌ ఆడేవాళ్లం. అది స్నేహానికి దారి తీసింది. ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. ప్రేమంటే ఏంటో నాకు ఇంటర్‌ తర్వాత తెలిసింది. ఆయనకు సంబంధించిన స్నేహితుడితో మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.   

పెద్దలను ఒప్పించాం..  
నన్ను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించాను. బీబీఏ చదువుకున్న బాబిరెడ్డి తనతో ఉన్న స్నేహం ఆ తర్వాత ప్రేమకు దారి తీయడంతో పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్‌ చేశారు. మా ఇద్దరి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకొంటారో లేదో అని సందేహించాను. మీరే మా పెద్దలను ఒప్పించాలని చెప్పడంతో ఆయన తన తల్లిదండ్రులను తీసుకొచ్చి మా నాన్న కేకేను కలిశారు. మొత్తానికి మా పెళ్లికి ఒప్పించారు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు నాకు ప్రేమ లేఖలు రాసేవారు. ముందు పెళ్లి చేసుకుందామని ఆయనే ప్రపోజ్‌ చేశారు. నేను ఒప్పుకొనే వరకూ నా వెంటతిరిగారు.  

తరగని ప్రేమ..  
పెళ్లి తర్వాత ఇద్దరం కలిసి అమెరికా వెళ్లాం. అక్కడ నేను జాబ్‌ చేస్తూనే చదువుకునేదాన్ని. ఇద్దరి మధ్య ఏనాడూ పొరపొచ్చాలు రాలేదు. నా తల్లిదండ్రులు ఇండియాకు రావాలని కోరడంతో అదే విషయాన్ని ఆయనకు చెప్పాను. ఒక్క మాట కూడా అనకుండా నాతో పాటు ఇండియాకు వచ్చేశారాయన.  
 
కలిసే భోంచేస్తాం..   
మా ఆయన ప్రతిరోజూ ఏదో ఒక పూట నాతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం లంచ్‌ లేదా రాత్రి డిన్నర్‌ మొత్తానికి ఇద్దరం కలిసే తింటాం. ఆయనతో పాటు ఆయన తల్లిదండ్రులది కూడా విశాలమైన హృదయం. 

నువ్వుంటే చాలు..  
ఈ రోజుకు మా ఇద్దరి మధ్య ఏ విషయంలోనూ చిన్న గొడవ జరగలేదు. ఆయన ఎప్పుడూ నువ్వుంటే చాలు అంటుంటారు. మాకు పిల్లలు లేరన్న విషయంలో ఎప్పుడూ బాధ లేదు. నన్ను ఆయన తన సొంత పిల్లల్లా చూసుకుంటే ఆయనను నేను చిన్న పిల్లాడిగానే చూస్తాను. నాకు నా తండ్రి కేకే మొదటి ప్రాధాన్యం అయితే రెండో ప్రాధాన్యం భర్తకే ఇస్తాను.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌.. రూ.13 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు 

మరిన్ని వార్తలు