Hyderabad Metro Prices Hike: మెట్రో వడ్డన.. 25 నుంచి 30 శాతం చార్జీల పెంపు? 

15 Nov, 2022 14:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ మెట్రో చార్జీలు 25 నుంచి 30 శాతం పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  పెరిగిన టికెట్‌ ధరలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. చార్జీల పెంపునకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఫెయిర్‌ ఫిక్సేషన్‌ కమిటీకి ఈ– మెయిల్‌ ద్వారా సలహాలు పంపించేందుకు విధించిన గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ప్రజల నుంచి పలు అంశాలపై సూచనలు అందినట్లు సమాచారం.

ప్రధానంగా మెట్రోలో చార్జీల పెంపునకు బదులు ఆదాయం పెంచుకునేందుకు నగరంలో మెట్రోకు కేటాయించిన విలువైన ప్రభుత్వ స్థలాల లీజు, మాల్స్‌ నిర్మాణం, స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మినీ బస్సులను నడపడం, ప్రతి స్టేషన్‌లో ఉచితంగా పార్కింగ్‌ సదుపాయం కల్పించడం, స్టేషన్‌ మధ్య భాగంలో తక్కువ అద్దెతో నిత్యావసరాలు విక్రయించుకునేందుకు చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న సూచలు అందడం విశేషం.  

ఆదాయ ఆర్జనలో విఫలం.. 
మెట్రో నిర్మాణం సమయంలో ప్రయాణికుల చార్జీల ద్వారా 45 శాతం.. మరో 50 శాతం వాణిజ్య స్థలాలు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా సమకూర్చుకోవడం, మరో అయిదు శాతం వాణిజ్య ప్రకటనల రూపంలో ఆదాయ ఆర్జన చేయాలని నిర్మాణ సంస్థ నిర్దేశించుకుంది. నిర్మాణ పనులు ఆలస్యం కావడం, కోర్టు కేసులు, రాష్ట్ర విభజన, కోవిడ్‌ విజృంభణ, ఆర్థిక మాంద్యం తదితర కారణాల రీత్యా నిర్మాణ సంస్థ అంచనాలు తలకిందులయ్యాయి. నగరం నడిబొడ్డున పలు చోట్ల సుమారు 269 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థలాలను 60 ఏళ్లపాటు సంస్థకు సర్కారు కేటాయించింది. ఈ స్థలాలను అభివృద్ధి చేసి ఆశించిన స్థాయిలో ఆదాయం రాబట్టే విషయంలోనూ సంస్థ చతికిలపడింది. 

తాజాగా పెరిగే విద్యుత్‌ చార్జీల భారం, నిర్వహణ కష్టాలు, రుణాలు, వాటిపై వడ్డీతో తడిసి మోపెడు కావడం తదితర కారణాలను సాకుగా చూపి చార్జీల పెంపునకు సిద్ధపడటం గమనార్హం. ప్రభుత్వం నుంచి రూ.3 వేల కోట్ల మేర సాఫ్ట్‌లోన్‌ మంజూరు అంశం కూడా కొలిక్కి రాకపోవడంతో చార్జీలు పెంచడం మినహా ఇతర ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగర మెట్రోలో కనీస చార్జీ రూ.10.. గరిష్టంగా రూ.60గా ఉంది. పెంపు ప్రతిపాదనలను 25 నుంచి 30 శాతానికి పరిమితం చేస్తారా? అంతకంటే అదనంగా పెంచుతారా? అన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు