లాక్‌డౌన్‌ దారుల్లో.. హైదరాబాద్‌ కలల మెట్రో పయనమెటు?

16 May, 2021 12:14 IST|Sakshi

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి!

కరోనా, లాక్‌డౌన్‌ దెబ్బ 

కష్టాల్లో కలల మెట్రో  

సాక్షి, హైదరాబాద్‌: అది 2010 సంవత్సరం.. మెట్రో నిర్మాణ ఒప్పందం సందర్భంగా కలల మెట్రో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్యపై భారీగా ఊహాగానాలు చేశారు. 2021 నాటికి మూడు రూట్లలో నిత్యం సుమారు 16 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని భారీ అంచనాలు వేశారు. కానీ దశాబ్ద కాలంలో నిర్మాణ సంస్థ లెక్కలు.. అంచనాలు తప్పాయి. కోవిడ్‌ విజృంభణ.. లాక్‌డౌన్‌ కారణంగా పట్టుమని పది వేల మంది కూడా జర్నీ చేయని పరిస్థితి నెలకొంది. ఏకంగా మెట్రో రైలు వేళలను ప్రస్తుతం ఉదయం 7 నుంచి 8.45 గంటల వరకే కుదించడంతో ఈ దుస్థితి తలెత్తింది. 

2020 లాక్‌డౌన్‌కు ముందు 4.5 లక్షల మంది.. 
గతేడాది మార్చికంటే (లాక్‌డౌన్‌)కు ముందు ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం మార్గాల్లో సుమారు 4.5 లక్ష ల మంది జర్నీ చేసేవారు. ఇదే స్పీడ్‌తో దూసుకెళ్లి హీనపక్షం సుమారు 8 లక్షల ప్రయాణికుల మా ర్క్‌.. అంటే నిర్మాణ సంస్థ అంచనాల్లో కనీసం సగమైనా లక్ష్యం సాధిస్తుందని అనుకున్నారు. పరిస్థితి మాత్రం తల్లకిందులైంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిరి్మంచిన మెట్రో స్టేషన్లు, రైళ్లు, డిపోలు ఇప్పుడు తెల్ల ఏనుగులను తలపిస్తున్నాయి.


ఆద్యంతం నష్టాలు.. కష్టాల పయనమే.. 
► ప్రధాన నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన మార్గాల్లో సుమారు 72 కి.మీ మార్గంలో మెట్రో ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. నిర్మాణం ప్రారంభమైన 2011 నుంచి పూర్తయిన 2017 వరకు పలు ప్రాంతాల్లో భూమి, ఆస్తుల సేకరణ, పనులు చేపట్టేందుకు వీలుగా రైట్‌ ఆఫ్‌ వే ఏర్పాటు వంటివన్నీ సమస్యలుగానే మారాయి.  

► నిర్మాణ సమయంలో కష్టాలు..పట్టాలెక్కిన తర్వాత నష్టాలు శాపంగా పరిణమించాయి. సుమారు రూ.17 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు నిత్యం సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. ప్రాజెక్టు నిర్మాణం కోసం వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణానికి సంబంధించి వడ్డీలు, వాయిదాల చెల్లింపులు ఇప్పుడు తడిసిమోపెడవుతున్నాయి.  


ఇప్పట్లో గట్టెక్కేది కష్టమే.. 
కోవిడ్‌ ప్రజా రవాణా వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది. మెట్రోను సైతం కుదిపేసింది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది చివరినాటికైనా నష్టాల నుంచి మెట్రో గట్టెక్కుతుందా లేదా? వేచి చూడాల్సిందే. 

>
మరిన్ని వార్తలు