Hyderabad: మెట్రో ప్రయాణికులకు షాక్‌.. 10 % డిస్కౌంట్‌ ఎత్తివేత.. టికెట్‌ ధరల్లో మార్పులు

1 Apr, 2023 14:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో చార్జీలపై రాయితీని ఎత్తేశారు. కాంటాక్ట్‌లెస్‌ స్మార్ట్‌కార్డులు, క్యూఆర్‌కోడ్‌పైన ప్రయాణం చేస్తున్న వారికి ఇప్పటి వరకు చార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తున్న సంగతి  తెలిసిందే. తాజాగా ఈ రాయితీపైన కోత విధిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎల్‌అండ్‌టీ ప్రకటించింది. రద్దీ లేని వేళలకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేసింది.

ఈ మేరకు ఇప్పటి వరకు అన్ని వేళల్లో 10 శాతం రాయితీ లభిస్తుండగా ఇక నుంచి రద్దీ లేని సమయాలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 12 వరకు మాత్రమే ఈ రాయితీ వర్తించనున్నట్లు అధికారులు  తెలిపా రు. ఆఫ్‌ పీక్‌ అవర్స్‌లో భాగంగా రాయితీని కుదించినట్లు పేర్కొన్నారు. శనివారం నుంచే ఇది అమల్లోకి రానుంది. దీంతో ప్రతిరోజు మెట్రోలో రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులు ఇక సాధారణ చార్జీలపైనే రాకపోకలు సాగించవలసి వస్తుంది.

మరోవైపు గుర్తించిన సెలవు రోజుల్లో కేవలం రూ.59కే అపరిమితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించిన సూపర్‌ సేవర్‌ ఆఫర్‌ ధరలను సైతం రూ.100కు పెంచింది. దీంతో ఇప్పటి వరకు కేవలం రూ.59 చెల్లించి సెలవు రోజుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణం చేసినవారు ఇక నుంచి ఎస్‌ఎస్‌ఓ–99 టిక్కెట్‌లపైన ప్రయాణం చేయవలసి ఉంటుంది.

ఇది కూడా శనివారం నుంచి అమల్లోకి రానున్నట్లు  అధికారులు చెప్పారు. అమాంతంగా పెంచింది. ఈ కొత్త పథకం వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతుంది. దీంతో ఆఫర్‌ టిక్కెట్‌ల ధరలను సైతం ఏకంగా 40 శాతం పెంచినట్లయింది.  

10 లక్షల మంది వినియోగించారు.. 
ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రవేశపెట్టిన ట్రావెల్‌యాజ్‌ యు లైక్‌ టికెట్‌ల తరహాలోనే హైదరాబాద్‌ మెట్రో రైల్‌  సూపర్‌ సేవర్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. వీకెండ్స్, పండుగలు, ఇతర ప్రత్యేక సెలవు రోజుల్లో  అతి  తక్కువ చార్జీలతో మెట్రో రైళ్లలో రోజంతా ప్రయాణించే విధంగా అందుబాటులోకి తెచి్చన ఈ సూపర్‌ సేవర్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఎస్‌ఎస్‌ఓ–59 పేరుతో అమల్లోకి తెచ్చిన ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మందికి పైగా ప్రయాణం చేసినట్లు అంచనా.

నగరవాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ సందర్శన కోసం వచ్చిన పర్యాటకులు, ఇతర పనులపైన నగరానికి వచ్చిన వారు సైతం ఈ ఆఫర్‌ను వినియోగించుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సూపర్‌ సేవర్‌ ధరలను హెచ్‌ఎంఆర్‌ఎల్‌ రూ.100కు పెంచి సూపర్‌ సేవర్‌ ఆఫర్‌ (ఎస్‌ఎస్‌ఓ)–99ను  ప్రవేశపెట్టింది. అంటే  ఇప్పటి వరకు రూ.60తో రోజంతా  ప్రయాణం చేసిన వారు ఇక నుంచి రూ.100 చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఇప్పటికే ఎస్‌ఎస్‌ఓ–59 వినియోగిస్తున్న వారు అదనపు డబ్బులు చెల్లించి ఎస్‌ఎస్‌ఓ–99 కోసం వినియోగించవచ్చు. గుర్తించిన సెలవుల జాబితా  ఆన్‌లైన్‌లోనూ, అన్ని మెట్రో స్టేషన్‌లలోనూ అందుబాటులో ఉంటుందని  అధికారులు  తెలిపారు. రెగ్యులర్‌గా ప్రయాణించేవారు, సాధారణ ప్రయాణికులు  ఎప్పటిలాగే మెట్రో సేవలను వినియోగించుంటారని ఆశిస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ అండ్‌సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు.  

పెరిగిన రద్దీ
మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో నగరవాసులు మెట్రో ప్రయాణం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు, ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మూడు కారిడార్‌లలో ప్రతి రోజు  సుమారు 1000 ట్రిప్పుల వరకు రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మూడు కారిడార్లలోని 57 స్టేషన్‌ల నుంచి ఇటీవల వరకు సుమారు 4 లక్షల మంది రాకపోకలు సాగించగా ఇప్పుడు ఆ సంఖ్య 4.4 లక్షలకు పెరిగింది. వేసవి తాపం కారణంగానే కూల్‌ జర్నీని ఎంపిక చేసుకొనే వారిసంఖ్య పెరుగుతోంది.   

మరిన్ని వార్తలు