మెట్రో తడబాటు! ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల నష్టం

11 Aug, 2021 08:17 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ వాసుల కలల మెట్రో రైలు ప్రాజెక్టుకు ఏడాదిగా నష్టాల బాట తప్పడంలేదు. కోవిడ్, లాక్‌డౌన్, ప్రయాణికుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉండడంతో సుమారు రూ.2 వేల కోట్ల మేర నష్టాలను మూట గట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మెట్రోను ఆదుకునేందుకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మాణ సంస్థ వర్గాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. ఆపన్న హస్తం అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆర్థిక పరంగా తమకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి షరతులు లేని దీర్ఘకాలిక రుణం మంజూరు చేయాలని, లేని పక్షంలో మెట్రో నిర్మాణం ఆలస్యమైన కారణంగా పెరిగిన రూ. 3వేల కోట్ల అంచనా వ్యయాన్ని సాయంగా అందజేయాలని ప్రభుత్వానికి నిర్మాణ సంస్థ వర్గాలు విన్నవించినట్లు సమాచారం.  

అత్యధికంగా ఆ రూట్‌లో.. 
గతేడాది లాక్‌డౌన్‌కు ముందు ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం మూడు మార్గాల్లో నిత్యం సుమారు 4.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం కారణంగా ప్రస్తుతం సుమారు లక్షమంది జర్నీ చేస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లో సుమారు 60 వేల మంది.. నాగోల్‌–రాయదుర్గం మార్గంలో సుమారు 30 వేలు..జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ రూట్లో సుమారు పదివేల మంది రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపాయి. 

మెట్రోకు షరతులు లేని దీర్ఘకాలిక రుణం మంజూరు, లేదా సర్దుబాటు నిధి కింద పెరిగిన నిర్మాణ వ్యయంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వ గ్రాంటుగా అందజేసే అంశం ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో సర్కారు ఎంత మొత్తంలో మెట్రోకు సాయం అందిస్తుందన్నది సస్పెన్స్‌గా మారింది.   

మరిన్ని వార్తలు