Hyderabad: సౌరశక్తి ఉత్పాదనలో మెట్రో రైల్‌ సూపర్

6 Jun, 2022 19:35 IST|Sakshi

డిపోల్లో 8.35 మెగావాట్ల విద్యుదుత్పత్తి

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు సౌరశక్తి ఉత్పాదనలో ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు బాటలు వేస్తోంది. కర్భన ఉద్గారాలను తగ్గించే కృషిలో ముందుంటోంది. ప్రస్తుతం 28 మెట్రో స్టేషన్ల పైకప్పులు, ఉప్పల్, మియాపూర్‌ డిపోల్లోని ఖాళీ ప్రదేశాల్లో 8.35 మెగావాట్ల క్యాప్టివ్‌ సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండడం విశేషం. మెట్రో స్టేషన్లు, కార్యాలయాల్లో ఉపయోగించే విద్యుత్‌ అవసరాల్లో సుమారు 15 శాతం సౌరశక్తి ద్వారానే పొందుతున్నట్లు నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ వర్గాలు తెలిపాయి. 

ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి.. 
► సంప్రదాయేతర ఇంధన వనరులపై మెట్రో దృష్టి సారించింది. ఇప్పటికే మెట్రో రైళ్లలో బ్రేకులు వేసినపుడు ఉత్పన్నమయ్యే బలంతో విద్యుత్‌ ఉత్పత్తి అయ్యేలా రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థను ఉపయోగిస్తుండడం విశేషం. సౌరశక్తి, రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థలను ఉపయోగిస్తున్నందుకు 20 మెట్రో స్టేషన్లకు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందాయి.  

► లీడర్‌షిప్‌ ఇన్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌ ప్లాటినం సర్టిఫికెట్‌ను కూడా మెట్రో సాధించింది. మెట్రో స్టేషన్లలో 100 శాతం సౌరవెలుగును ఉపయోగించుకోవడం,క్రాస్‌ వెంటిలేషన్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని పరిమిత మోతాదులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఉప్పల్, మియాపూర్‌ డిపోల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు 150 భారీ ఇంకుడు గుంతలను నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంగణాల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టింది. 

పలు అవార్డుల పంట.. 
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం కారణంగా నగర మెట్రోకు పలు అవార్డులు వరించాయి. గతేడాది తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రీ అవార్డ్‌(2021) దక్కింది. ఇక తాజాగా ఎక్సలెన్స్‌ ఇన్‌ గ్రీన్‌ అండ్‌ సస్టైనబుల్‌ మెట్రో సిస్టం బై రైల్‌ అనాలిసిస్‌ ఇండియా(2022) అవార్డు వరించింది. (క్లిక్‌: ఇక వీకెండ్‌ షీ టీమ్స్‌.. ఈ ప్రాంతాల్లో ఫోకస్‌)

మూడు లక్షల మార్కును దాటిన ప్రయాణికుల సంఖ్య.. 
ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం మార్గాల్లో నిత్యం మూడు లక్షల మంది జర్నీ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. మే నెలలో అధిక ఎండల కారణంగా చాలా మంది ప్రయాణికులు మెట్రో జర్నీకి మొగ్గు చూపడం విశేషం.

మరిన్ని వార్తలు