మెట్రో రైల్‌: ఎంఆర్‌పీఎఫ్‌ ఏమైనట్లు?

17 Nov, 2020 08:33 IST|Sakshi

‘మెట్రో’ భద్రతకు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన

మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయిన వైనం 

మూడు చోట్ల ప్రత్యేక ఠాణాల ఏర్పాటూ అటకెక్కింది 

పోలీసులకు భారంగా మారిన ‘మెట్రో రైల్‌’ డ్యూటీలు 

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైల్‌ సర్వీసులు ప్రారంభమై మూడేళ్లు.. అన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. దాని భద్రత పర్యవేక్షణకు అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రత్యేక విభాగం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆదిలోనే అటకెక్కాయి. సాధారణ రైళ్లల్లో జరిగే నేరాలు, రైల్వేస్టేషన్ల పర్యవేక్షణకు గవర్నమెంట్‌ రైల్వేపోలీసు (జీఆర్పీ) విభాగం ఉన్నట్లే.. మెట్రో రైల్‌ కోసం మెట్రో రైల్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఎంఆర్‌పీఎఫ్‌) విభాగాన్ని ఏర్పాటు చేయాలని 2017లో ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ఇప్పటికీ అమలులోకి రాలేదు సరికదా.. ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. 

  • ఎంఆర్‌పీఎఫ్‌కు సంబంధించిన విధి విధానాలు, సిబ్బంది సంఖ్య తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. మెట్రో రైల్, రైల్వేస్టేషన్ల భద్రతకు సంబంధించిన అనేక కీలకాంశాలను ఇందులో ఖరారు చేశారు. వీటిని సంబంధించి సమగ్ర నివేదికలతో కూడిన ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించారు. ఆపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు.  
  • మెట్రో రైల్‌ తొలి దశ ప్రారంభం నాటికే భద్రతాంశాలతో పాటు ప్రత్యేక భద్రతా విభాగాన్ని అమలులోకి తీసుకురావడానికి రాష్ట్ర పోలీసు విభాగం, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థలు కసరత్తు చేశాయి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అదే స్థాయిలో భద్రతను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.  
  • మెట్రో రైల్‌కు సంబంధించి మొత్తం 65 స్టేషన్లు, మూడు డిపోలు ఏర్పాటయ్యాయి. ప్రతి 22 మెట్రో రైల్‌స్టేషన్లకు ఒక ఎంఆర్‌పీఎఫ్‌ స్టేషన్‌ చొప్పున నగరంలో మూడింటిని ఏర్పాటు చేయాలని భావించారు.  
  • ప్రాథమికంగా నిర్ణయించిన దాని ప్రకారం ఇవి ఎంజీబీఎస్, పరేడ్‌ గ్రౌండ్స్‌లతో పాటు అమీర్‌పేటల్లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండు కారిడార్లు కలిసే ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్లు కావడంతో పాటు ఇవే అతి పెద్దగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  
  • ఒక్కో మెట్రో రైల్‌ స్టేషన్‌కు ఎస్సై స్థాయి అధికారి నేతృత్వంలో టీమ్‌ ఏర్పాటు చేయాలని భావించారు. మొత్తం 24 గంటల్లో మూడు షిఫ్టుల్లో ఎంఆర్‌పీఎఫ్‌ పోలీసుల విధి నిర్వహణ ఉండేలా ప్రణాళికలు రచించారు. ప్రతి షిఫ్ట్‌లోనూ ఎస్సైతో పాటు హెడ్‌–కానిస్టేబుళ్ళు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ మహిళా కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తించేలా చూడాలని యోచించారు. 
  • ప్రతి రెండు మెట్రో రైల్‌స్టేషన్లకు కలిపి ఓ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి ఇన్‌చార్జి, ఇద్దరు డీసీపీ, మరో ఇద్దరు ఏసీపీలతో పాటు ఎంఆర్‌పీఎఫ్‌కు మొత్తం 1525 మంది సిబ్బంది కేటాయించాల్సి ఉంటుందని అంచనా వేశారు. వీరి నిర్వహణకు ఏటా రూ.60 కోట్లు అవసరమవుతాయని లెక్కలు కూడా తేల్చారు.  
  • ఆకతాయిలకు చెక్‌ చెప్పడానికి ‘షీ టీమ్స్‌’ బృందాలనూ స్టేషన్లలో మోహరించాలని... ప్రత్యేక సందర్భాల్లో వీటి సంఖ్యను మరింత పెంచాలని యోచించారు. ఇవన్నీ ప్రతిపాదనల స్థితిలోనే ఆగిపోగా... ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లను స్థానిక ఠాణా అధికారులే కేటాయిస్తున్నారు.  
  • ఎంఆర్పీఎఫ్‌కు తోడుగా సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) పోలీసులూ ‘మెట్రో’ భద్రతలో భాగస్వాముల్ని చేయాలనే యోచన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రత్యేక యాక్ట్‌ ఉండాలని భావించారు. ఎంఆర్‌పీఎఫ్‌కు సిబ్బందికి పోలీసు విభాగంలోని సివిల్, ఏఆర్‌ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.  
  • ఈ స్టేషన్లను సంబంధించిన, ఆ పరిధిలో జరిగే నేరాలపై నమోదైన కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మెట్రోపాలిటన్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని భావించారు. ఎంఆర్‌పీఎఫ్‌ కోసం ప్రత్యేకంగా పోలీసు జాగిల విభాగాన్ని ఏర్పాటు చేయాలంటూ హడావుడి చేశారు. 
  •  వీటిలో దాదాపు 90 శాతం అంశాలకు ఆదిలోనే బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అవన్నీ ప్రతిపాదనల స్థాయిలోనే ఆగిపోయాయి. మెట్రో రైల్‌ ప్రారంభంకావడంతో పాటు నిరంతరాయంగా నడుస్తుండటంతో ఆ ప్రతిపాదనల్ని దాదాపు అన్ని విభాగాలూ మర్చిపోయాయి. 

ఇప్పుడిక కష్టమే అనిపిస్తోంది
మెట్రో రైల్‌ ప్రారంభానికి ముందు, ప్రారంభమైన తొలినాళ్లల్లో ఉన్న ఆ జోష్‌ ఇప్పుడు లేదు. దీనికి తోడు లాక్‌డౌన్‌ ప్రభావం, సర్వీసులు పునఃప్రారంభమైనా తగ్గిన ఆక్యుపెన్సీ వంటి అనేక సమస్యలు ఇప్పుడు హెచ్‌ఎంఆర్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాటి ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తాయని భావించలేం. – సిటీ పోలీసు ఉన్నతాధికారి   

మరిన్ని వార్తలు