Hyderabad Metro Rail: రెండో దశ మెట్రో రూట్‌ చేంజ్‌!

24 May, 2022 09:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులు చేసే అంశంపై హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ తాజాగా కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా బీహెచ్‌ఈఎల్‌– లక్డికాపూల్‌ (27 కి.మీ)మార్గం ఏర్పాటుపై గతంలో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ రూపొందించిన నివేదికలో సూచించిన అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ రూట్లో ఎస్‌ఆర్డీపీ పథకం కింద నూతనంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, లింక్‌దారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మెట్రో మార్గాన్ని ఫ్లైఓవర్ల వద్ద అత్యంత ఎత్తున ఏర్పాటు చేయడం అనేక వ్యయ ప్రయాసలతో కూడుకోవడమే కారణమని సమాచారం.  గతంలో ఈ మార్గానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రెండేళ్ల క్రితం ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ సిద్ధం చేసిన విషయం విదితమే. 

బీహెచ్‌ఈఎల్‌– లక్డికాపూల్‌ మెట్రో రూట్‌ ఇలా.. 
ఈ మార్గాన్ని బీహెచ్‌ఈఎల్, మదీనాగూడ, హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ జంక్షన్, షేక్‌పేట్, రేతిబౌలి, మెహిదీపట్నం, లక్డికాపూల్‌ రూట్లో ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. ఈ రూట్లోనే తాజాగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల ఆధ్వర్యంలో పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయడంతో మెట్రో మార్గానికి అడ్డొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని దాటుతూ మెట్రోను ఏర్పాటు చేసేందుకు అధిక వ్యయం కావడం, ప్రధాన రహదారిపై పనులు చేపట్టేందుకు వీలుగా రైట్‌ఆఫ్‌ వే ఏర్పాటు చేయడం వీలుకానందున మెట్రో మార్గంలో స్వల్ప మార్పులు అనివార్యమని హెచ్‌ఎంఆర్‌ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.   

మార్పులపై మెట్రో వర్గాల మౌనం.. 
మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులపై హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌) ఉన్నతాధికారులను  ‘సాక్షి’ ప్రతినిధి సంప్రదించగా.. ఈ అంశం తమ పరిధిలోది కాదని.. మున్సిపల్‌ పరిపాలన శాఖ పరిశీలనలో ఉందని స్పష్టంచేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం. 

డీఎంఆర్‌సీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంశాలివే.. 
బీహెచ్‌ఎఈఎల్‌–లక్డికాపూల్‌ మార్గంలో 22 మెట్రో స్టేషన్ల ఏర్పాటు. బీహెచ్‌ఈఎల్‌లో మెట్రో డిపో ఏర్పాటుకు 70 ఎకరాల స్థలం కేటాయింపు. రెండోదశ మెట్రో రైళ్లకు సిగ్నలింగ్‌ వ్యవస్థ, కోచ్‌ల ఎంపిక,ట్రాక్‌ల నిర్మాణం. భద్రతా పరమైన చర్యలు. టికెట్‌ ధరల నిర్ణయం. రెండోదశ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ. వివిధ రకాల ఆర్థిక నమూనాల పరిశీలన. ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన గడువు, దశలవారీగా చేపట్టాల్సిన షెడ్యూలు ఖరారు.  

(చదవండి: పోలీసు కొలువు కొట్టేలా!)

మరిన్ని వార్తలు