రెంటికీ రెడ్‌ సిగ్నల్‌!

19 Jan, 2021 09:13 IST|Sakshi

మెట్రో నిర్మాణ వ్యయం రూ.9 వేల కోట్లు 

రూ.250 కోట్లతోనే ఎంఎంటీఎస్‌ రైళ్లు 

బెంగళూర్‌ ఎయిర్‌పోర్టుకు లోకల్‌ ట్రైన్‌ పరుగులు 

నగరవాసులకు రూ.25తోనే ఎయిర్‌పోర్టు జర్నీ 

అయినా యంత్రాంగంలో కనిపించని కదలిక   

సాక్షి, హైదరాబాద్‌: కేవలం రూ. 25 చార్జీతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొనేలా ఎంఎంటీఎస్‌ నడిపేందుకు నాలుగేళ్ల క్రితం దక్షిణమధ్య రైల్వే ముందుకొచ్చింది. కానీ రైల్వేస్టేషన్‌ ఏర్పాటుకు జీఎమ్మార్‌ నిరాకరించడంతో ప్రతిష్టంభన నెలకొంది. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు రూ. 9000 కోట్లతో 32 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ నిర్మించనున్నట్లు  ప్రభుత్వం తరచూ ప్రకటిస్తోంది. కానీ నష్టాల్లో నడుస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎయిర్‌పోర్టుకు పరుగులు పెట్టే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కేవలం రూ.250 కోట్లతో ఎంఎంటీఎస్‌ పూర్తి చేస్తే ఎయిర్‌పోర్టుకు రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు  ప్రయాణికులు లోకల్‌ రైళ్లలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అక్కడి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టడం సులభమే.  

బెంగళూరులో లోకల్‌ ట్రైన్‌ పరుగులు 
⇔ బెంగళూర్‌లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2 కి.మీ దూరంలోని రైల్వేస్టేషన్‌  కొద్దిరోజులుగా ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో సందడిగా మారింది. విమానాల రాకపోకలతో పాటు అన్ని వివరాలను అక్కడ ప్రదర్శిస్తున్నారు.  
 ఆ రైల్వేస్టేషన్‌ నుంచి టెర్మినల్‌కు చేరుకొనేందుకు షటిల్‌ సర్వీసులు నడుస్తున్నాయి. కానీ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి అనుమతి లభిస్తే  ప్రయాణికులు ట్రైన్‌ దిగి నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా రైళ్లను నడపనున్నట్లు ద.మ రైల్వే గతంలో స్పష్టం చేసింది.  
⇔ రైల్వేస్టేషన్‌కు స్థలాన్ని ఇచ్చేందుకు జీఎమ్మార్‌ నిరాకరించింది. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను పొడిగిస్తే భూగర్భ స్టేషన్‌ నిర్మాణానికి అవకాశం ఇవ్వనున్నట్లు  పేర్కొంది.  
⇔ నగరంలోని వివిధ మార్గాల్లో రోజుకు రూ.కోటి నష్టంతో నడుస్తున్న మెట్రో రైళ్లు కి.మీ కూడా అదనంగా పరుగెత్తే అవకాశం ఇప్పట్లో లేదు. ‘బెంగళూరు ప్రయాణికులు రూ.20 లోపు చార్జీలతోనే ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు. ఎంఎంటీఎస్‌కు అవకాశం లభిస్తే హైదరాబాద్‌లోనూ అలాంటి సదుపాయం అందుబాటులోకి వస్తుంది’ అని ద.మ. రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.  
ఉందానగర్‌ నుంచి 6 కి.మీ  
⇔ ఎంఎంటీఎస్‌ రెండో దశలో ఫలక్‌నుమా నుంచి ఉందానగర్‌ వరకు సింగిల్‌ లైన్‌ను డబ్లింగ్‌ చేసి విద్యుదీకరించాలనేది ప్రతిపాదన. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు వరకు 6 కి.మీ వరకు కొత్తగా లైన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ,250 కోట్లు ఖర్చవుతుందని 2013లోనే అంచనాలు రూపొందించారు. 
 రెండో దశలో ఈ  ప్రాజెక్టు చేపట్టాలని భావించినప్పటికీ జీఎమ్మార్‌ నిరాకరించడంతో పాటు  ప్రభుత్వం కూడా ఎలాంటి చొరవ చూపకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. 
 నగర శివార్లను కలుపుతూ ఆరు మార్గాల్లో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టుకు ఇప్పటికీ నిధుల కొరత వెంటాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.550 కోట్లు విడుదల కాకపోవడంతో లైన్ల నిర్మాణం పూర్తయినా రైళ్లు కొనలేని పరిస్థితి నెలకొంది. 
⇔ రెండో దశ పూర్తయితే సికింద్రాబాద్‌– ఘట్‌కేసర్, సికింద్రాబాద్‌– బొల్లారం, మౌలాలీ– నగత్‌నగర్, తెల్లాపూర్‌– బీహెచ్‌ఈఎల్, ఫలక్‌నుమా– ఉందానగర్, ఎయిర్‌పోర్టు– ఉందానగర్‌ మధ్య రైళ్లు నడుస్తాయి. 

యాదాద్రి అంతే.. 
 రూ.330 కోట్లతో రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు కూడా నిధుల కొరత కారణంగా పడకేసింది. 
⇔ ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగించాల్సి ఉంది. అక్కడి నుంచి మరో 6 కి.మీ రోడ్డు మార్గంలో వెళ్తారు. కానీ ఈ ప్రాజెక్టు సర్వేకే పరిమితమైంది.  

మరిన్ని వార్తలు