ఫలించని వ్యూహాలు.. గ్రేటర్‌ మెట్రోకు కొత్త కష్టాలు!

9 Nov, 2022 07:23 IST|Sakshi

ఆర్థిక కష్టాల్లో గ్రేటర్‌ మెట్రో రైలు 

50 శాతం వాటా విక్రయించేందుకు నిర్మాణ సంస్థ రెడీ? 

ఛార్జీల పెంపుతో గట్టెక్కాలని నయా ప్లాన్‌

ఆశించిన స్థాయిలో లభించని లీజు ఆదాయం  

సాక్షి, సిటీబ్యూరో: పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న గ్రేటర్‌ మెట్రోను గట్టెక్కించేందుకు నిర్మాణ సంస్థ ఆపసోపాలు పడుతోంది. ఇందుకోసం ఐదేళ్లుగా అమలు చేస్తోన్న సరికొత్త వ్యూహాలు ఆశించినస్థాయిలో సత్ఫలితాన్నివ్వడం లేదు. తాజాగా ప్రాజెక్టులో తమ వాటాను 50 శాతం విక్రయించేందుకు ముందుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

మెట్రో నిర్మాణం చేపట్టేందుకు వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి సుమారు 13 వేల కోట్ల  రుణాలను సేకరించింది. ఇందులో తమ వాటాను సగానికి తగ్గించుకోవడం ద్వారా రూ.7,500 కోట్లు సమీకరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రుణాలపై వడ్డీ భారాన్ని సైతం ఇటీవల సుమారు 2.5 శాతం తగ్గించుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. మరోవైపు టిక్కెట్‌ ఛార్జీల పెంపు ద్వారా రోజువారీగా భారంగా మారిన నిర్వహణ నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నినస్తుండడం గమనార్హం. 

ఇందుకోసం ప్రభుత్వం ఫెయిర్‌ ఫిక్సేషన్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇక మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రధాన నగరంలో ప్రభుత్వం నిర్మా ణ సంస్థకు కేటాయించిన సుమారు 69 ఎకరాల విలువైన స్థలాలను క్రమంగా లీజుకివ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన స్థాయిలో సత్ఫలితాన్నివ్వలేదు. తాజాగా రాయదుర్గంలోని 15 ఎకరాల స్థలాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా మరో వెయ్యికోట్లు ఆదాయం సమకూర్చుకునేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమైంది. 

వాటా దక్కించుకునేదెవ్వరో.. 
ఐదేళ్లుగా నష్టాలతో నెట్టుకొస్తున్న గ్రేటర్‌ మెట్రోలో నిర్మాణ సంస్థ విక్రయించాలనుకుంటున్న  50 శాతం వాటాను దక్కించుకునేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశం సస్పెన్స్‌గా మారింది. ఒకవైపు భయపెడుతోన్న నష్టాలు..మరోవైపు కొండలా పేరుకుపోయిన రుణాలు,వాటిపై వడ్డీ చెల్లింపులు భారంగా మారిన తరుణంలో నిర్మాణ సంస్థ వాటాల విక్రయం అంత సులభం కాదని ఆర్ధిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్, లాక్‌డౌన్‌ కారణంగా భారీగా నష్టపోయిన తమకు రూ.3 వేల కోట్ల మేర వడ్డీలేని సాఫ్ట్‌లోన్‌ను మంజూరు చేయాలని నిర్మాణ సంస్థ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఙప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం. 
అనుకున్నదొక్కటి... 

- నగరంలో ఎల్బీ నగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మూడు మార్గాల్లో 69.2 కి.మీ మేర మెట్రో అందుబాటులోకి వచ్చింది. 

- ప్రస్తుతం ఈ రూట్లలో నిత్యం 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ అంచనాల మేరకు ఈ మూడు రూట్లలోనిత్యం 16 లక్షలమంది జర్నీ చేస్తారని ఐదేళ్ల క్రితం అంచనా వేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు.  

- పార్కింగ్‌ కష్టాలు, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ లేకపోవడం తదితర అంశాలు మెట్రోకు శాపంగా మారాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు కనీస ఛార్జీని ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి..గరిష్ట ఛార్జీని ప్రస్తుతం ఉన్న రూ.60 నుంచి రూ.100కు పెంచేందుకు ప్రయత్నినస్తునట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు