HYD Metro: మెట్రో ఛార్జీలు పెంపు!

6 Jan, 2023 07:35 IST|Sakshi

ఔట్‌ సోర్సింగ్‌ చేతుల్లో మెట్రో   

కీలక నిర్వహణ విధులన్నీ ప్రైవేటు ఏజెన్సీలవే  

ఉద్యోగుల నియామకాలు, జీతభత్యాలూ గోప్యంగానే.. 

గుట్టు విప్పని నిర్వహణ సంస్థ కియోలిస్‌ 

ప్రయాణికులపై త్వరలో చార్జీల బాదుడు  

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో ప్రాజెక్టులో రైళ్లు, స్టేషన్లు, డిపోలు, కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ వ్యవస్థ నిర్వహణ, భద్రత.. ఇలా అతి కీలకమైన విధులన్నీ ప్రైవేటు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల చేతుల్లోనే ఉన్నాయి. ఈ విధానం తప్పు కాకపోయినా.. మెట్రో నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న అతిపెద్ద కియోలిస్‌ సంస్థ ప్రతీ పనిని తిరిగి పలు ప్రైవేటు ఏజెన్సీలకు సబ్‌కాంట్రాక్టు పేరిట అప్పజెప్పింది. సుమారు పదికిపైగా ప్రైవేటు ఏజెన్సీలు మెట్రో జర్నీలో పాలుపంచుకున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఈ ఏజెన్సీలు చేపట్టే ఉద్యోగుల నియామకాలు, వారికి నెలవారీగా ఇచ్చే జీత భత్యాలు, కారి్మకులు, ఉద్యోగుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు.. చివరకు ఏ ఏజెన్సీ.. ఏ విధులు నిర్వహిస్తోందన్న విషయాల్లోనూ అంతులేని గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.  

టికెటింగ్‌ సిబ్బంది సమ్మెతో.. 
తాజాగా స్టేషన్లలో టికెటింగ్‌ విధులు నిర్వహించే సిబ్బంది అమీర్‌పేట్‌ స్టేషన్‌ వద్ద మెరుపు సమ్మెకు దిగడంతో ఆయా ఏజెన్సీల నిర్వాకం వెలుగుచూసింది. ప్రైవేటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప్పల్‌ మెట్రో డిపోలో జరిపిన చర్చలు, అరకొరగా పెంచిన వేతనాలు ఉద్యోగుల అసంతృప్తిని పూర్తిస్థాయిలో చల్లార్చకపోవడం గమనార్హం. మూడు కారిడార్లలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం ఉండడం, పని గంటలు, ఇతర భత్యాల విషయంలో తాము శ్రమదోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. నగర ప్రజారవాణా వ్యవస్థలో కొత్త శకం ఆవిష్కరించిన మెట్రో ప్రాజెక్టులో ఇలాంటి విపరిణామాలు చోటు చేసుకోవడం ఆక్షేపణీయమని ప్రజారవాణా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ విషయంలో పారదర్శకత ఉండాలని, ఉద్యోగులకు కనీస వేతనాలు మంజూరు చేయాలని స్పష్టంచేస్తున్నారు. 

- ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం మూడు రూట్లలో నిత్యం 4 నుంచి 4.5 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ నష్టాల నుంచి ఇప్పట్లో గట్టెక్కే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడంలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపులు, రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ భారంగా పరిణమించింది. ప్రభుత్వ పరంగా అందాల్సిన సాఫ్ట్‌లోన్‌ అందకపోవడం మెట్రోకు శాపంగా మారింది. 

- ఈ నేపథ్యంలో తాజాగా చార్జీల పెంపునకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ప్రస్తుతం ఉన్న కనీస చార్జీని రూ.10 నుంచి రూ.20కి.. గరిష్ట చార్జీని రూ.60 నుంచి రూ.80 లేదా రూ.100 వరకు పెంచే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చార్జీల పెంపుతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండవన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నగరంలో అన్ని మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు రవాణా సదుపాయం కలి్పంచకపోవడం, అన్ని స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్‌ వసతుల లేమి కారణంగా ఆశించిన స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదన్నది సుస్పష్టం.
 

మరిన్ని వార్తలు