Bholakpur Corporator: పోలీసులకు వార్నింగ్‌.. కేటీఆర్‌ సీరియస్‌.. ఎంఐఎం కార్పొరేటర్‌ అరెస్ట్‌

6 Apr, 2022 14:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌​: పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల పట్ల గౌసుద్దీన్‌ ప్రవర్తన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని కొంతమంది మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశారు. ట్విటర్‌లో స్పందించిన కేటీఆర్‌ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డిని కోరారు. మంత్రి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భోలక్‌పూర్ కార్పొరేషన్‌ గౌసుద్దీన్‌ను అరెస్ట్‌ చేశారు. అతనిపై సెక్షన్‌ 350, 506 కింద కేసులు నమోదు చేశారు.

కాగా ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ మంగళవారం రాత్రి పెట్రోలింగ్‌ పోలీసులతో దుర్భాషలాడాడు. రాత్రిపూట హోటళ్లు నడిపేందుకు అనుమతి లేదని చెప్పిన పెట్రోలింగ్ పోలీసుల పట్ల కార్పొరేటర్ గౌసుద్దీన్ అనుచితంగా ప్రవర్తించాడు. రంజాన్‌ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. అంతేగాక  మీరంతా వంద రూపాయలకు పనిచేసే వ్యక్తులు అంటూ దురుసుగా వ్యవహరించాడు.

చదవండి: నేనేమీ అధికారం చెలాయించడం లేదు: గవర్నర్‌ తమిళిసై 

అయితే ఈ ఘటనపై  మంత్రి కేటీఆర్ సీరియస్‌ అయ్యారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు