విద్యుత్‌ బకాయిలపై కేంద్రం ఆదేశాలు.. రాష్ట్రంపై కక్ష సాధింపు: మంత్రి జగదీశ్‌రెడ్డి

30 Aug, 2022 01:29 IST|Sakshi

నిరంతర విద్యుత్‌ సరఫరాను ఓర్వలేకనే కుట్ర: జగదీశ్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌:  ఏపీకి నెల రోజుల్లో విద్యుత్‌ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం ఏకపక్షంగా ఆదేశించడం దుర్మార్గమని, కక్షసాధింపు చర్య అని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. జాతీయ ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలని కుట్రలు పన్నుతోంది.

విద్యుత్, బకాయిలు, పీపీఏల విషయంలో తెలంగాణకు ఏపీ తీవ్ర నష్టం చేసినా ఎప్పుడూ కేంద్రం జోక్యం చేసుకోలేదు. ఏపీ నుంచి రూ.12,900 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని మొర పెట్టుకున్నా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేసింది’’ అని పేర్కొన్నారు. గుజరాత్‌ సహా అన్నిరాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం నెలకొని ఉందని, ఎడాపెడా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని.. కానీ తెలంగాణలో కేసీఆర్‌ సర్కారు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తుండటం కేంద్రానికి కంటగింపుగా మారిందని ఆరోపించారు.   

మరిన్ని వార్తలు