నాగోల్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌..

26 Oct, 2022 13:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. నాగోల్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ) కింద రూ. 143 కోట్లతో 990 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీంతో నాగోల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెడుతున్నామన్నారు.

నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్లాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. లేదంటే బెంగళూరు తరహాలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎఎస్సార్‌డీపీ కార్యక్రమాన్ని తీసుకుమని.. రూ. 8వేల52 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం 32 ప్రాజెక్టులు పూర్తికగా 16 ఫ్లై ఓవర్లు ఉన్నాయన్నారు.

‘హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు అవి తగ్గిపోయాయి. ఎల్బీనగర్ నియోజకవర్గలో 700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులు పూర్తి చేశాం. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం. ఎల్బీనగర్ ప్రాంతంలో 600 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశాం. భవిష్యత్తు తరాలకు మెరుగైన వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మౌలిక వసతులతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. రాజకీయాలు ఎన్నికల అప్పుడు చేద్దాం. ఇప్పుడు అభివృద్ధి పై ఫోకస్ చేద్దాం’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

తీరనున్న ట్రాఫిక్‌ కష్ట్రాలు
రెండు వైపుల ప్రయాణించేలా  ఉన్న ఫ్లైఓవర్‌ను జీహెచ్‌ఎంసీ సర్వాంగ సుందరంగా తీర్చదిద్దింది. ఒక్కోవైపు మూడు లేన్లతో ఉన్న ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో ఎల్‌బీనగర్‌ వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు రాకపోకలు సాగించేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కావడంతోపాటు నాగోల్‌ చౌరస్తా వద్ద, బండ్లగూడ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యలు 75 శాతం పరిష్కారం కానున్నాయి.. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్‌బీనగర్‌ల మీదుగా ఉప్పల్‌ వరకు వచ్చేవారు ఈ ఫ్లైఓవర్‌తో సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. 

ఇది 16వ ఫ్లైఓవర్‌.. 
ఎస్సార్‌డీపీ ద్వారా పూర్తయిన పనుల్లో ఇది 16వ ఫ్లైఓవర్‌. ఇప్పటికే 15 ఫ్లైఓవర్లతోపాటు 5 అండర్‌పాస్‌లు, 7 ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు, దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జి, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌బీనగర్‌ పరిసరాల్లోని నాలుగు జంక్షన్లలో రూ. 448 కోట్లతో  చేపట్టిన పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. 

సులభ ప్రయాణం.. 
2015 సర్వే మేరకు నాగోలు జంక్షన్‌ వద్ద రద్దీ సమయంలో గంటకు 7,535 వాహనాలు(పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 12,648కి చేరుకోనుందని జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ ఎం.దేవానంద్‌ తెలిపారు. సిగ్నళ్లు లేని సాఫీ ప్రయాణం వల్ల వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా కావడంతోపాటు వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఎస్సార్‌డీపీ అధికారులు కె. రమేష్‌ బాబు, రోహిణి, జీహెచ్‌ఎంసీ హయత్‌నగర్‌ సర్కిల్‌ డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ్‌ఓ శ్రీనివాస్, ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు నాగోలు ప్లైఓవర్‌ను పరిశీలించారు. 

మరిన్ని వార్తలు