‘ఔటర్‌’ అందాలు అదరహో! కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌

17 Dec, 2021 10:39 IST|Sakshi

సాక్షి, పటాన్‌చెరు(హైదరాబాద్‌): ఓఆర్‌ఆర్‌ను మరిపించే రీతిలో రీజినల్‌ రింగ్‌రోడ్డు రానుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం రాత్రి పటాన్‌చెరు మండల పరిధిలోని ముత్తంగి రింగ్‌రోడ్డుపై ఎల్‌ఈడీ దీపాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో ఏ నగరానికి కూడా మన దగ్గర ఉన్న విధంగా 160 కిలోమీటర్ల రింగ్‌ రోడ్డు లేదన్నారు. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు జరగకుండా రెండు దశల్లో 270.5 కిలోమీటర్ల పరిధిలో 9,706 కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి.. వాటిలో 18వేల 220 ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తొందర్లోనే 340 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఓఆర్‌ఆర్‌ను మరిపించేలా వస్తుందన్నారు. అమీన్‌పూర్‌ మండల పరిధిలోని సుల్తాన్‌ మెడికల్‌ డివైస్‌ పార్క్‌లో 50 సంస్థలకు స్థలాలు ఇచ్చామని, ఇప్పటికే ఏడు సంస్థలను ప్రారంభించామని తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి దొరకాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఓఆర్‌ఆర్‌ రాకతో 80 వేల ఎకరాల స్థలంలో పరిశ్రమలను ఆహ్వానించడానికి మంచి అవకాశం వచ్చిందన్నారు.

సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు దొరికేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్‌ సభ్యుడు రంజిత్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, శాసన మండలి సభ్యుడు రాజు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ, హెచ్‌ఎండీఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

‘ఔటర్‌’ వెలిగిపోతోంది 
సాక్షి, సంగారెడ్డి: ఓఆర్‌ఆర్‌ ఎల్‌ఈడీ దీపాలతో వెలిగిపోతోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఓఆర్‌ఆర్‌పై రూ.100.22 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ పనులను ప్రారంభించిన అనంతరం ఎల్‌ఈడీ దీపాలతో వెలిగిపోతున్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. 

మరిన్ని వార్తలు