Kalyana Lakshmi Scheme: ‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’

14 May, 2022 10:07 IST|Sakshi
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్‌ శిరీష తదితరులు

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణలోనే సాధ్యమైంది 

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

సాక్షి,కూకట్‌పల్లి(హైదరాబాద్‌): పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించడం దేశంలో ఎక్కడా లేదని, అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 15 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు. పింఛన్‌ డబ్బుల్లో రూ.1900 కేసీఆర్‌ ప్రభుత్వం అందిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.100 మాత్రమే ఇస్తుందన్నారు. అంతా తామే ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారాలతో బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, చేతనైతే అభివృద్ధిలో పోటీ పడాలని బీజేపీ నేతలకు ఆయన సూచించారు.

దేశంలో జాతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో అయినా ప్రస్తుత పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుందని బీజేపీ నాయకులకు హితవు పలికారు. నేడు దేశం అంతా కరెంటు లేక సతమతం అవుతుంటే.. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో నేడు తెలంగాణలో 24గంటల విద్యుత్‌ సరఫరా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష బాబురావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్‌ తూము శ్రావణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

చదవండి: దినేష్‌ దశ తిరిగెన్‌.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్‌ ఆఫర్‌ 

 

మరిన్ని వార్తలు