Hyderabad-Mumbai Bullet Train: బుల్లెట్‌ బండి.. పట్నం వస్తోందండీ

26 Nov, 2021 07:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై టు హైదరాబాద్‌ హైస్పీడ్‌ రైలు

మొత్తం 650 కిలోమీటర్లు, 10 స్టేషన్లు

సుమారు 3 గంటల ప్రయాణం

పనులు ప్రారంభించిన హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి చారిత్రక భాగ్యనగరికి హైస్పీడ్‌ రైల్‌ అందుబాటులోకి రానుంది. రెండు నగరాల ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌) కార్యాచరణ చేపట్టింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 650 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఎలివేటెడ్‌ వయాడక్ట్, టన్నెల్‌  కారిడార్‌ కోసం హెచ్‌ఎస్‌ఆర్‌ తాజాగా భూసేకరణ పనులను చేపట్టింది. థానె, నవీ ముంబై, లోనావాలా, పుణె, బారామతి, పండరీపూర్, షోలాపూర్, గుల్బర్గా, వికారాబాద్‌ల మీదుగా ఈ రైలు పరుగులు పెట్టనుంది.

మొత్తం 10 స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది. ఎలివేటెడ్‌ కారిడార్‌గా ఉంటుందని, అవసరమైన చోట్ల సొరంగ మార్గాల్లో నిర్మించనున్నట్లు హెచ్‌ఎస్‌ఆర్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు ప్రధాన నగరాల మధ్య రోడ్డు మార్గంలో వాహనాల రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తక్కువ సమయంలో  గమ్యస్థానానికి చేరుకొనేలా బుల్లెట్‌ రైలు అందుబాటులోకి రానుంది.
చదవండి: అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారి మృతి!  

గంటకు  330 కి.మీ వేగం.. 
హైస్పీడ్‌ రైలు గంటకు 330 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ట్రైన్‌లో మొత్తం 10 కార్లు ఉంటాయి. 750 మంది హాయిగా ప్రయాణం చేయొచ్చు. ప్రస్తుతం మెట్రో రైలు తరహాలోనే పూర్తిగా ఏసీ బోగీలు ఉంటాయి. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో 284 గ్రామాల్లో సుమారు 1197.5 ఎకరాల భూమిని సేకరించనున్నారు. మహారాష్ట్రలో నాలుగు జిల్లాలు థానె, రాయ్‌పూర్, పుణె, షోలాపూర్, కర్ణాటకలోని గుల్బర్గా, తెలంగాణలో వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల మీదుగా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. 
చదవండి: ప్రధాని అపాయింట్‌మెంట్‌ కేసీఆర్‌ అడగలేదు

రైలుకు ఎక్కువ.. ఫ్లైట్‌కు తక్కువ... 
ప్రస్తుతం హైదరాబాద్‌– ముంబై మధ్య విమానాలు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం నుంచి కూడా పెద్ద ఎత్తున రాకపోకలు కొనసాగుతున్నాయి. 617 కి.మీ విమాన యానానికి 1.30 గంటల సమయం పడుతోంది. ముంబై– హైదరాబాద్‌ మధ్య 773 కి.మీ ఉన్న రైలు మార్గంలో 14.20 గంటల సమయం పడుతోంది. రోడ్డు మార్గం 710 కి.మీ వరకు ఉంటుంది. బస్సులు, కార్లు తదితర వాహనాల్లో చేరుకొనేందుకు 13. 15 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం  నిర్మించతలపెట్టిన  650 కి.మీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ద్వారా గంటకు 330 కి.మీ చొప్పున కేవలం 3 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. 

మరిన్ని వార్తలు