రాజకీయ క్రీడలో ప్రభుత్వ అధికారి ఔట్‌.. ఇక్కడ ఇంతే!

26 Feb, 2023 08:37 IST|Sakshi

సాక్షి,మేడ్చల్‌(హైదరాబాద్‌): మేడ్చల్‌ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ఆడిన రాజకీయ క్రీడలో కమిషనర్‌ అవుట్‌ అయ్యారు. చైర్‌పర్సన్‌ లక్ష్యంగా సాగిన ఈ రాజకీయ క్రీడలో కౌన్సిలర్ల బంతికి చైర్‌పర్సన్‌ కాకుండా కమిషనర్‌ చిక్కాడు. ఆరు నెలలుగా మేడ్చల్‌ మున్సిపాలిటీలోని అధికార పార్టీలో 16 మంది కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌ దీపికా నర్సింహా రెడ్డిల మధ్య రాజకీయ అగాధం ఏర్పడింది. 16 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చైర్‌పర్సన్, కమిషనర్‌ అహ్మద్‌ షఫిఉల్లా కుమ్మక్కై అభివృధ్ధి చేయకుండా అవినితీకి పాల్పడుతున్నారని విమర్శిస్తూ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.

ఆరు నెలలుగా మేడ్చల్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా వీడి జోరుగా రాజకీయాలు చేస్తున్నారు. కొందరు వైస్‌ చైర్మన్‌ గ్రూపుగా, మరి కొందరూ చైర్‌పర్సన్‌ గ్రూపుగా మారారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాస నోటీసులు ఇవ్వగా రెండో డిమాండ్‌ కింద కమిషనర్‌ను బదిలీ చేయాలని పట్టుబట్టారు. కమిషనర్‌ చైర్‌పర్సన్‌తో కుమ్మక్కై తమను ఖాతరు చేయడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అధిష్టానం వద్ద పట్టుబట్టి కూర్చున్నారు. 

మంత్రి ఇంట్లో సమావేశంతోనే..
మేడ్చల్‌ మున్సిపాలిటీలో సమావేశాలు నిర్వహిస్తే తరుచూ రచ్చ చేస్తున్నారని, మీడియా ముంగిట అసమ్మతి వెల్లగక్కుతున్నారని మంత్రి మల్లారెడ్డి చైర్‌పర్సన్, అధికారులు, కమిషనర్, అధికార పార్టీ కౌన్సిలర్లతో తమ ఇంట్లో రెండు రోజుల క్రితం రహస్య సమావేశం నిర్వహించారు. అవిశ్వాస విషయం చట్ట పరిధిలో ఉండటంతో అది పక్కన పెట్టి అసమ్మతి కౌన్సిలర్ల వాదనను మంత్రి విన్నారు. తమకు విలువ ఇవ్వని కమిషనర్‌ అహ్మద్‌ షఫిఉల్లాను బదిలీ చేయాలని గట్టిగా వాదించడం, ఒక్కసారిగా బదిలీ చేసే అధికారం లేకపోవడంతో మంత్రి మల్లారెడ్డి ఇక్కడ రాజకీయం ప్రదర్శించారు. కౌన్సిలర్ల డిమాండ్‌ మేరకు కమిషనర్‌ అహ్మద్‌ షఫిఉల్లా వెళ్లిపోవాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. బదిలీకి వెంటనే ఆస్కారం లేకపోవడంతో కమిషనర్‌ 15 రోజుల పాటు దీర్ఘకాలికంగా సెలవు పెట్టి వెళ్లిపోయారు. 

చట్టం చెప్పే కమిషనర్‌... 
సెలవులపై వెళ్లిన కమిషనర్‌ అహ్మద్‌ షఫిఉల్లా ముక్కుసూటిగా మాట్లాడే అధికారిగా మేడ్చల్‌లో తన ముద్ర వేశారు. ప్రతి విషయంలో తాను చట్టం ప్రకారంగా ఉంటూ పనులను ఆ ప్రకారంగానే చేస్తానని బల్ల గుద్ది చెప్పేవాడు. ఎవరికి అనుకూలంగా ఉండకుండా తన దైన శైలిలో పనిచేసి ఆఖరుకు సెలవు పెట్టే వరకు తెచ్చుకున్నాడు. తనపై ఆరోపణలు చేసిన కౌన్సిలర్లకు ఆయన గతంలో మున్సిపల్‌ కార్యాలయంలోనే నాపై ఆరోపణలు చేసిన వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఏది ఉన్నా తాను ఉన్నతాధికారులకు చెప్పుకుంటానని మీడియా ముందు తేల్చి చెప్పాడు. అధికార పార్టీ నాయకులు, కౌన్సిలర్లకు అండగా ఉండకపోవడంతో ప్రభుత్వ అధికారి తనకు ఇష్టం, అవసరం లేకున్నా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ నాయకుల క్రీడలో ఓ అధికారి సెల్ఫ్‌ అవుట్‌ అవ్వడం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చదవండి    యజమాని భార్యతో డ్రైవర్‌ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌

మరిన్ని వార్తలు