పెళ్లైనప్పటి నుంచి మాటలు లేవు.. నా భర్తను చంపింది వాళ్లే: నీరజ్‌ భార్య

21 May, 2022 12:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన భార్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్‌ భార్య సంజన కోరారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. కాగా బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్‌ పన్వార్‌ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో నలుగురు దుండగులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

తాతతో కలిసి నీరజ్‌ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చేపల మార్కెట్‌ సమీపంలో మాటేసిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి.. కత్తులతో పొడిచి చంపారు. వేరే కులానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నందుకే యువతి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యను మరువక ముందే చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది

ఈ ఘటనపై నీరజ్‌ భార్య స్పందిస్తూ.. వివాహం అయినప్పటి నుంచీ వారి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. తన కజిన్ విజయ్, సంజులే ఈ హత్య చేశారని, మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి తెగబడ్డారని తెలిపింది. వారి నుంచి తనకు, తన అత్త, మామలకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నీరజ్‌తో పెళ్లి అయినప్పటి నుంచి వారితో సంబంధాలు లేవని తెలిపింది. ‘నేను వివాహం చేసుకున్న తర్వాత నా బిడ్డ చనిపోయింది అని వారు నన్ను వదిలేశారు. కానీ వాళ్లు ఇప్పుడిలా చేయడం వల్ల నాకు అన్యాయం జరిగింది’ అంటూ సంజన వాపోయింది.

ఇక వ్యాపారి నీరజ్ పన్వార్ హత్యను నిరసిస్తూ బేగంబజార్‌ వ్యాపారులు మార్కెట్ బంద్ పాటిస్తున్నారు. నీరజ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారవేత్తలందరూ ఈ హత్యను ఖండిస్తున్నామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు వేగంగా స్పందించిన నిందితులను అరెస్ట్ చేయడంపై కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారులు వారికి త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని చెబుతున్నారు.

తన కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ పన్వార్‌ తండ్రి జగదీష్ ప్రసాద్ పన్వార్‌ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం , కమిషనర్ ఆఫ్ పోలీస్ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
చదవండి: పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే..

మరిన్ని వార్తలు