మూసీపై నిర్మించనున్న వంతెనలకు కొత్త సొబగులు 

5 Oct, 2021 08:16 IST|Sakshi

 సిటీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా చర్యలు

పర్యాటక ప్రాంతాలుగా పరిఢవిల్లేలా ప్రత్యేక ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌: మూసీపై దాదాపు డజను కొత్త వంతెనలు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం అవి వైవిధ్యంగా..విభిన్నంగా..కొత్త సొబగులతో అలరించేలా ఉండాలని భావిస్తోంది. అటు ట్రాఫిక్‌ చిక్కులు తీర్చడంతోపాటు ఇటు హైదరాబాద్‌ నగరం, తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా తగిన వాస్తుశిల్పాలతో ఉండాలని భావిస్తోంది. మూసీ వంతెనలపై సాఫీ ప్రయాణమే కాకుండా చూడ్డానికి కూడా అందంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే దుర్గం చెరువు, ట్యాంక్‌బండ్‌లు పర్యాటక ప్రాంతాలుగా కొత్త సొగసులతో ఆకట్టుకుంటుండంతో మూసీలపై  నిర్మించే ఈ కొత్త వంతెనలు కూడా వాటిలాగే ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండాలని యోచిస్తోంది. వీటన్నింటి అంచనా వ్యయం దాదాపు రూ.390 కోట్లు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ (హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)ల ఆధ్వర్యంలో వీటిని నిర్మించనున్నారు. 
చదవండి: నీటిలో వణుకుతూ రాత్రంతా జాగారం 

ఇలా ఉండాలి..  
► ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా కొత్త వంతెనలు దిగువ విధంగా ఉండాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.  
►  చూడ్డానికి అందంగా..ఆకర్షణీయంగా ఉండాలి. 
► హైదరాబాద్‌ వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించాలి.  
► మూసీ వంతెనలపై నుంచి పరిసర ప్రజలకు సాఫీ ప్రయాణం సాగాలి.  
► వివిధరోడ్లపై ట్రాఫిక్‌ సాఫీగా సాగేలా ట్రాఫిక్‌ డిస్ట్రిబ్యూషన్‌.  
► వీటి వినియోగం వల్ల మేజర్‌ కారిడార్లలో కూడా  ట్రాఫిక్‌ నిర్వహణ మెరుగవ్వాలి.  
► ప్రయాణ దూరం, ఇంధన ఖర్చు తగ్గాలి. 
► బ్రిడ్జిలకు సమీపంలో  వాణిజ్య సంస్థలు అభివృద్ధి చెందాలి. ఆస్తుల విలువ పెరగాలి. 
► ఇతర  ప్రధాన రహదారుల్లో  కర్బన ఉద్గారాలు,ట్రాఫిక్‌ జామ్స్,ప్రయాణసమయం తగ్గాలి.  
► పర్యాటకంగా అభివృద్ధి చెందాలి.  
చదవండి: బాబోయ్‌..ఇదేం రోడ్డు? వెళ్లాలంటేనే దడ పుడుతోంది!

పాతవాటికి కూడా.. 
దాదాపు 54 కి.మీ. మేర ఉన్న మూసీపై కొత్తగా వచ్చే ఈ వంతెనలతోపాటు, పాత వంతెనలకు కూడా కొత్త సొగసులద్దనున్నారు. కొత్త వంతెనలు అందంగా కనిపించేందుకు తగిన వాస్తుశిల్ప డిజైన్లకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆర్‌ఎఫ్‌పీలు ఆహా్వనించారు. ఆర్కిటెక్చర్‌లో అనుభవజ్ఞులు, నిపుణులతోపాటు ఆర్కిటెక్చర్‌ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. అంతేకాదు.. ఉత్తమ డిజైన్లతో ఎంపికైన వారికి మొదటి బహుమతికి రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతికి లక్ష రూపాయలు, మూడో బహుమతికి రూ.50వేలతోపాటు ముగ్గురికి కన్సొలేషన్‌గా రూ. 20వేల వంతున నగదు బహుమతులందజేయనున్నారు.  

సదుపాయం.. 
కొత్త బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే లంగర్‌హౌస్, పురానాపూల్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, తదితర ప్రాంతాల్లో రాకపోకలు సాగించేవారికి ఎంతో సదు పాయం కలుగుతుంది. మూసీలోకి మురుగునీరు చేరకుండా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి.  

కొత్త వంతెనలు ఈ ప్రాంతాల్లోనే..
♦ ఐకానిక్‌ వంతెన, అఫ్జల్‌గంజ్‌. 
♦ మూసారాంబాగ్‌ వద్ద  
♦ ఇబ్రహీంబాగ్‌ కాజ్‌వేపై మిస్సింగ్‌ లింక్‌ (కారిడార్‌ నెంబర్‌ 99) 
♦  చాదర్‌ఘాట్‌ వద్ద  
♦ సన్‌సిటీ– చింతల్‌మెట్‌ (పవర్‌ కారిడార్‌)మార్గంలో..  
♦ ఇన్నర్‌రింగ్‌రోడ్‌ –కిస్మత్‌పూర్‌లను కలుపుతూ.. 
♦  బుద్వేల్‌ (ఐటీ పార్కులు, కనెక్టింగ్‌ రోడ్లను కలుపుతూ) 
♦ హైదర్‌షాకోట్‌ – రామ్‌దేవ్‌గూడ  
♦  మూసీపై అత్తాపూర్‌ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు 
♦  మూసీ దక్షిణ ఒడ్డును ఉప్పల్‌ లేఔట్‌ను కలుపుతూ కొత్త బ్రిడ్జి. దక్షిణ ఒడ్డును కలిపేలా  లింక్‌ రోడ్డు. 
♦  ప్రతాప్‌సింగారం–గౌరెల్లి మార్గంలో.  

మరిన్ని వార్తలు