Hyderabad: నగరంలో ఆక్సిజన్‌ సమస్యకు చెక్‌

5 May, 2021 09:19 IST|Sakshi

కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రికి ఆక్సిజన్‌ ప్లాంట్‌ 

కోటి వ్యయంతో ఏర్పాటుకు ముందుకొచ్చిన బీడీఎల్‌ సంస్థ 

ప్రత్యేక చొరవ తీసుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌( గచ్చిబౌలి): కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్‌ దొరక్క చాలా చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రికి కోటి రూపాయల విలువ చేసే ఆక్సిజన్‌ ప్లాంట్‌ మంజూరయ్యింది. ఈ ప్లాంటు మంజూరుకు చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో వైద్య సేవల వివరాలను రంజిత్‌రెడ్డి ప్రభుత్వ వైద్యాధికారులతో మాట్లాడారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్‌ సమస్య తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన ఆయన ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం ఆక్సిజన్‌ సిలెండర్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం రంజిత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ సారథ్యంలో నడిచే భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) ఉన్నతాధికారులతో చర్చించి వారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు బీడీఎల్‌ సంస్థ అంగీకరించింది. దీంతో ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సమస్య ఉత్పన్నం అయ్యే ప్రసక్తే లేకుండా పోతుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యులు రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటును త్వరలో ఏర్పాటు చేసేందుకు బీడీఎల్‌ సంస్థ ముందుకొచ్చిందన్నారు. దీంతో భవిష్యత్‌లో ఆక్సిజన్‌ సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల సహకారంతో అవసరమైన మేరకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల కు మెరుగై న సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 
– రంజిత్‌రెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు   

( చదవండి: కోవిడ్ బాధితుల కోసం ఉచిత ఆక్సిజన్‌ హబ్‌లు.. )

మరిన్ని వార్తలు