వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య

9 Dec, 2022 08:36 IST|Sakshi
 శైలు (ఫైల్‌)  

సాక్షి, హైదరాబాద్‌: తరచూ సెల్‌ఫోన్‌లో వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలించినందుకు ఓ నవవధువు రెండో అంతస్తు నుంచి దూకి అత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీష్‌రెడ్డి, మృతురాలి బంధువులు తెలిపిన మేరకు.. విజయవాడకు చెందిన కమల, జనార్దన్‌రెడ్డిల కుమార్తె శైలు(20) వివాహం కడప జిల్లా పులివెందులకు చెందిన ఓబుల్‌రెడ్డి కుమారుడు గంగప్రసాద్‌రెడ్డితో 2022 అక్టోబర్‌ 16న జరిగింది.

గంగప్రసాద్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా దంపతులు చింతల్‌లోని శ్రీసాయికాలనీలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పెళ్లికి ముందు సైతం శైలు సెల్‌ఫోన్‌లో ఎక్కువగా షార్ట్‌ వీడియోలు చూస్తూ ఉండేది. పెళ్లయిన తర్వాత కూడా ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తోనే గడుపుతుండటంతో దంపతుల మధ్య గొడవ జరిగేది. ఇదే విషయమై బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో శైలు బుధవారం రాత్రి తాను అత్మహత్య చేసుకుంటానని భర్తతో చెప్పింది.

భయపడిన ప్రసాద్‌రెడ్డి శైలు తల్లి కమలకు తెలిపి ఆమె హైదరాబాద్‌ వచ్చేందుకు బస్‌ టికెట్‌ బుక్‌  చేశాడు.ఆమె విజయవాడ నుండి హైదరాబాద్‌కు బయలేదేరింది. గురువారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో శైలు.. భర్త ప్రసాద్‌రెడ్డి పడుకున్నది చూసి వారు ఉంటున్న రెండవ అంతస్తు నుంచి దూకింది. శబ్దం విన్న భర్త  కిందకి వచ్చి చూడగా శైలు రక్తపు మడుగులో పడి మృతిచెంది ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. శైలు తల్లి కమల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు