ప్రీతి బ్రెయిన్‌డెడ్‌!.. నిమ్స్‌ వద్ద భారీగా పోలీసులు.. కాసేపట్లో వైద్యుల కీలక ప్రకటన

26 Feb, 2023 17:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం నిమ్స్‌ వైద్యులు బులిటెన్‌ విడుదల చేశారు. ర్యాంగింగ్‌ పెనుభూతంతో వణికిపోయిన ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయడం, గత ఐదురోజులుగా నగరంలోని నిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి నరేందర్ ఆమె ఆరోగ్య స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రీతి బ్రెయిడ్‌ డెడ్‌ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొంత ఆశ ఉండేది. కానీ, ఆమె బ్రతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆశలు వదిలేసుకున్నాం ఆయన మీడియా సాక్షిగా తెలిపారు. ‘‘ప్రీతిని సైఫే హత్య చేశాడు. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి. ఈ ఇష్యూను హెచ్‌వోడీ సరిగా హ్యాండిల్‌ చేయలేదు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్‌ను నియంత్రించలేకపోయారు. సరికదా.. ఘటన తర్వాత కూడా మాకు టైంకి సమాచారం అందించలేదు. ప్రీతి మొబైల్‌లో వాళ్లకు కావాల్సినట్లుగా సాక్ష్యాలు క్రియేట్‌ చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాల’’ని డిమాండ్‌ చేశారాయన. 

కాసేపట్లో ప్రీతి హెల్త్‌ బులిటెన్‌పై నిమ్స్‌ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిమ్స్‌ డైరెక్టర్‌, పోలీసులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు.

అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి సైతం ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే! అని ప్రకటించారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని ప్రకటించారాయన. ఇక ప్రీతి ఘటన బాధాకరమన్న మంత్రి.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తలు