Hyderabad: మూసీ నదికి పోటెత్తిన​ వరద.. రాకపోకలు బంద్‌

27 Jul, 2022 16:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌, హియాయత్‌సాగర్‌ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కో రిజర్వాయర్‌కు 8 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు గాను ప్రస్తుతం 1761.9 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో 8000 క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 10700 క్యూ సెక్కులు ఉంది. దీంతో 8 గేట్లు 4 అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 

ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1789.10 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో 8000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 8281 క్యూసెక్కులుగా ఉంది. 13 గేట్లు ఆరు అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని వదులుతున్నారు.

రాకపోకలు బంద్‌
మూసీ నది ఉధృతితో అధికారులు అలర్ఠ్‌ అయ్యారు. అంబర్‌పేట-కాచిగూడ, మూసారాంబాగ్‌- మలక్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. మరోవైపు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. మరికొన్ని గంటల్లో అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, కంటోన్మెంఠ్‌ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశ ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

సీపీ సందర్శన
ఉస్మాన్ సాగర్, ఓఆర్‌ఆర్‌ వద్ద వరద ప్రవాహాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. వర్షం ముంపునకు గురైన ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడుతో కలిసి హిమాయత్ సాగర్ చెరువు, హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు, గండిపేట చెరువులను సందర్శించారు.

భారీ వర్షాల కారణంగా హిమాయత్, ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో ఓఆర్‌ఆర్‌ సర్వీస్ రోడ్డుపై వరద నీరు పెరుగుతోందని, పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు. సైబరాబాద్ పోలీసులు ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలదిపారు. 

పోటెత్తిన వరద
మూసీ ప్రాజెక్టుకు అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ముందస్తుగా మూసీనది ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి నాలుగు అడుగుల ఎత్తిత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్‌ ఫ్లో 5,733.36 క్యూసెక్కులు వస్తుండగా  17, 809 క్యూసెక్కులు కాగా. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీటి సామర్థ్యం 637.500 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.67 టీఎంసీలుగా కొనసాగుతోంది.

యాదాద్రి జిల్లా బీబీ నగర్‌ మండలం రుద్రవల్లి గ్రామ శివారులో లోలెవల్‌ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద  ఉధృతంగా ప్రవహిస్తోంది. బీబీనగర్‌ మండలం, రుద్రవల్లి, భూదాన్‌ పోచలంపల్లి మండలం జూలురు గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవ్‌ బ్రిడ్జికి ఇరువైపుల వాహనదారులు, ప్రజలు ప్రయాణించకుండా బీబీనగర్‌ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవల​ వంతెనపై మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో భువనగిరి మండలం, భుల్లేపల్లి, వలిగొండ మండలం, సంగెం గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. 

మరిన్ని వార్తలు