Hyderabad: ఉస్మానియా.. ఆస్పత్రికి పనికిరాదు 

23 Jul, 2022 19:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి భవనం ప్రమాదకరంగా ఉంది. ఇప్పడున్న పరిస్థితుల్లో ఆస్పత్రి కొనసాగింపునకు పనికిరాదు. పునరుద్ధరణ, మరమ్మతులు చేస్తే భవన జీవితకాలం కొన్నేళ్లు పెంచొచ్చు. ఆ తర్వాత ఆస్పత్రి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. వారసత్వ భవన జాబితాలో ఉన్న నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలో రక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఆక్సిజన్‌ పైప్‌లైన్లు, గ్యాస్‌ లైన్లు, ఏసీలు, వాటర్‌ పైప్‌లైన్ల లాంటివి ఏర్పాటు చేస్తే దాని భవన ధృడత్వం మరింత దెబ్బతింటుంది’.. ఇదీ ఉస్మానియా ఆస్పత్రి భవన ధృడత్వంపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక.

కాగా, ఉస్మానియా ఆసుపత్రిని అదే భవనంలో కొనసాగించాలని కొందరు.. ఆ భవనంలో వద్దని మరికొందరు కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు(పిల్‌లు) దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. గతంలో హైకోర్టు.. ఉస్మానియా ఆస్పత్రి భవనం ఎంత బలంగా ఉందో తేల్చేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీలు, జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్‌లతో కమిటీ వేసింది. వరంగల్‌ ఎన్‌ఐటీ నిపుణుల సాయంతో ఆస్పత్రి భవనాన్ని గత మార్చి 19న పరిశీలన, పరీక్షలు నిర్వహించింది.

ఈ నేపథ్యంలో కమిటీలో అందరూ స్టేట్‌ ఆఫీషియల్స్‌ ఉండటంతో హైదరాబాద్‌ ఐఐటీ ప్రొఫెసర్, ఆర్కెయాలజీ ఆఫ్‌ ఇండియా ఎస్‌ఈ, స్టెడ్రంట్‌ టెక్నోకక్లినిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు కమిటీలో స్థానం కల్పించింది. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు నివేదించారు. నివేదిక అధ్యయనానికి గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం.. నివేదిక ప్రతులను పిటిషనర్లకు, ప్రతివాదులందరికీ అందజేయాలని సూచించింది. దానిపై అధ్యయనం చేసి.. ఆగస్టు 25కు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.  

మరిన్ని వార్తలు