వామ్మో.. చై'నో'..

14 Aug, 2020 07:34 IST|Sakshi

ఫుడ్‌ నుంచి ఫెంగ్‌ షుయ్‌ దాకా.. 

సిటీతో పెనవేసుకున్న చైనా కల్చర్‌కు వీడ్కోలు 

కరోనా, బోర్డర్‌లో ‘వార్‌’ కారణాలు 

చైనీస్‌ రెస్టారెంట్స్‌కు తగ్గిన డిమాండ్‌ 

పేరు మార్చుకున్న చైనా బజార్లు 

ఆ దేశ వస్తువులపై ఆసక్తి చూపని సిటిజనులు 

సాక్షి,సిటీబ్యూరో: ఇందుగలదందు లేదని సందేహము వలదన్నట్టు ఎందెందు వెతికినా అందందే కలదేమో అన్నట్టు నగరంలో విభిన్న రకాలుగా అల్లుకుపోయిన ఒక విదేశీ సంస్కృతి క్రమక్రమంగా అదృశ్యమవుతున్న దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ఆహారం నుంచి ఇంటికి మేలు చేసే వాస్తు దాకా అన్నింట్లో తానే అన్నట్టు మనతో కలగలసిపోయిన చైనా.. నిన్నటి సంగతి. కరోనా వైరస్‌ కావచ్చు.. 

ఆ దేశంతో వైరం కావచ్చు.. నాటి చైనా వైభవం ఇక అసంభవం. విశ్వమే ఒక కుగ్రామంగా మారిపోతున్న క్రమంలో భిన్న సంస్కృతులు మేళవింపు సాధారణమైపోయిన పరిస్థితుల్లో.. చైనా సంస్కృతి మన నగరంతో రకరకాలుగా పెనవేసుకుపోయింది. మిగతా అన్ని దేశాలకన్నా అధికంగా మన సంస్కృతితో మమేకమైన డ్రాగన్‌ కంట్రీ శరవేగంగా తన ప్రాభవం కోల్పోతోంది.        

ఫుడ్‌కి గుడ్‌బై.. 
చైనా ఫాస్ట్‌ ఫుడ్‌కి నగరంలో ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే.. వాటితో మొదలై తర్వాత తర్వాత చైనీస్‌ వంటకాలకు ప్రత్యేకించిన రెస్టారెంట్స్‌ కూడా వెలిశాయి. సికింద్రాబాద్‌లోని ఒక చైనీస్‌ రెస్టారెంట్‌ అయితే వారాంతాల్లో ముందస్తు రిజర్వేషన్‌ లేకపోతే సీట్‌ దొరికేది కాదు. అలాంటి చైనీస్‌ రెస్టారెంట్స్‌ కరోనా దెబ్బకి కునారిల్లిపోయాయి. వైరస్‌ అక్కడి ఆహారపు అలవాట్ల ద్వారానే వ్యాపించిందనే సందేహాల మధ్య నగరవాసులు చైనీస్‌ రెస్టారెంట్స్‌కి గుడ్‌బై చెప్పేశారు. నగరంలో దాదాపు 10 దాకా ఉన్న చైనా రెస్టారెంట్స్‌లో కొన్ని మూతపడగా మరికొన్ని మల్టీక్యుజిన్‌ రెస్టారెంట్స్‌గా మారే క్రమంలో ఉన్నాయి. ఇక రెస్టారెంట్స్‌ మెనూలో చైనీస్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ అట్టడుగుకు చేరాయి.  

నామ్‌ బదల్‌గయా.. 
అదేవిధంగా తక్కువ ధరకు లభించే ప్లాస్టిక్‌ తదితర వస్తువులకు పేరొంది, సిటిజనుల ఆదరణ చూరగొన్న చైనా బజార్లు కూడా తీరూ.. పేరూ మార్చేసుకున్నాయి. కొన్ని చైనా బజార్లు జనతా బజార్, ఇండియన్‌ బజార్‌.. తదితర పేర్లతో కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. దశాబ్ధాలుగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి షాపింగ్‌కి కేరాఫ్‌గా మారిన ఈ బజార్లు ఇప్పుడు చైనాని తలచుకునేందుకు కూడా ఇష్టపడటం లేదు. గృహాలంకరణలో భాగంగా ఒకప్పుడు చైనా ఉత్పత్తులను విరివిగా విక్రయించినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదు. హైదరాబాద్‌ జనరల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీరామ్‌ వ్యాస్‌ మాట్లాడుతూ డిసెంబరు నుంచే తాము చైనీస్‌ ఉత్పత్తులను కొనడం మానేశామన్నారు. దీనికి కరోనా వైరస్‌ ప్రధాన కారణమన్నారాయన. గిఫ్ట్‌ ఐటమ్స్, దుస్తులు, బ్యాగ్స్, వాచీలు, బెల్ట్సŠ, లగేజ్, కిచెన్‌ ఐటమ్స్, ఫుట్‌వేర్‌ తదితర చైనీస్‌ ఉత్పత్తులు 20–30శాతం వరకూ విక్రయించే స్టోర్లు నగరంలో 150 నుంచి 200 దాకా ఉన్నాయంటున్న ఆయన చైనీస్‌ ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయాలనే నిర్ణయం ప్రభావం కనిపిస్తోందన్నారు. అయితే మార్కెట్‌ నుంచి అవి సంపూర్ణంగా అదృశ్యం కావాలంటే మాత్రం కాస్త టైమ్‌ పడుతుందని స్పష్టం చేశారు. 

వాస్తు, జ్యోతిషం.. వద్దే వద్దు.. 
కొంతకాలం క్రితమే నగరంలో ప్రవేశించిన చైనా వాస్తు అనూహ్యంగా సిటీలోని సంపన్నుల ఇళ్లలో కొలువుదీరిన సంగతి తెలిసిందే. చైనా కలెక్షన్‌లో భాగమైన లాఫింగ్‌ బుద్ధ, బాంబూట్రీ తదితరాలు లేని ఇళ్లు అరుదే అంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఇప్పుడు చాలా స్టోర్స్‌లో ఫెంగ్‌ షుయ్‌ విక్రయాలు పడిపోయాయి. మరోవైపు చైనీయుల జ్యోతిష శాస్త్రానికి కూడా సిటీలో మంచి పాప్యులారిటీ ఉండేది. చైనీయుల టారో కార్డ్స్‌ ఆధారంగా జోస్యం చెప్పే స్పెషలిస్ట్‌లకూ మంచి డిమాండ్‌ ఉండేది. అలాంటిది ఇప్పుడు వీరికీ సిటిజనుల నుంచి నిరాదరణే ఎదురవుతోంది. ఇదే విధంగా సిటీలో చైనీస్‌ ఆర్ట్‌ని నమ్ముకున్న ఆర్టిస్టులూ ఉన్నారు. వారికి కూడా ఇప్పుడు మొండి చెయ్యి ఎదురయ్యే పరిస్థితి ఉంది. అలాగే నగరంలోని చైనీస్‌ మెథడ్స్‌ ఉపయోగించి సౌందర్య చికిత్సలు అందించే కొన్ని చైనీస్‌ పార్లర్స్‌ కూడా తమ స్పెషలైజేషన్‌కి మంగళం పాడే పనిలో ఉన్నాయి. కరోనా వైరస్‌ రాకతో మొదలైన ఈ మార్పు చేర్పులు బోర్డర్‌లో ఆ దేశం మనతో కయ్యానికి కాలు దువ్వడంతో బాగా ఊపందుకున్నాయి. ఏదేమైనా ఈ పరిస్థితి కొనసాగితే ఎంతోకాలంగా నగరంలో భిన్నరూపాల్లో వేళ్లూనుకున్న చైనా కల్చర్‌ శరవేగంగా అంతర్ధానం అవడం ఖాయంగా కనిపిస్తోంది.  

మరిన్ని వార్తలు