Covid Vaccine: సామాన్యుడికి సకాలంలో టీకా అందేనా?

5 May, 2021 08:12 IST|Sakshi

రిజిస్ట్రేషన్‌ క్యాన్సిల్‌ అయినట్లు మెస్సేజ్‌లు 

టీకా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిరాశ 

కోవిన్‌ పోర్టల్‌ యాప్‌ ఓపెన్‌ కాక ఇబ్బంది.. 

ఫోన్‌ నెంబర్లు లేని వారికి తప్పని ఇక్కట్లు  

‘సరూర్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌ రెండో డోసు టీకా కోసం బుధవారం ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్‌ చేసుకున్నారు. ఆయనకు ఈ నెల ఏడో తేదీన అబ్దుల్లాపూర్‌మెట్‌ పీహెచ్‌సీలో ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో టీకా వేయనున్నట్లు ఫోన్‌కు మెస్సేజ్‌ కూడా వచ్చింది. ఆ తర్వాతి రోజు బుక్‌ చేసుకున్న స్లాట్‌ కేన్సల్‌ అయినట్లు మళ్లీ మెస్సేజ్‌ వచ్చింది. సంబంధిత పీహెచ్‌సీకి వెళ్లి ఆరా తీయగా..టీకాలు స్టాక్‌ లేకపోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలిసి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. .. ఇలా శ్రీకాంత్‌ ఒక్కరే కాదు టీకా కోసం కోవిన్‌యాప్‌లో స్లాట్‌బుక్‌ చేసుకున్న అనేక మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు’.

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ టీకాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. ఇప్పటికే ఫస్ట్‌ డోసు టీకా తీసుకుని, రెండో డోసు కోసం ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకుంటున్న లబ్ధిదారులకు...స్లాట్‌బుకింగ్‌ రద్దయినట్లు మెస్సేజ్‌లు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నిష్పత్తికి తగినన్ని టీకాలు పంపిణీ చేయకపోవడమే ఇందుకు కారణం. టీకాలు ఎప్పుడు వస్తాయో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 45 ఏళ్లు పైబడిన వారు సుమారు 15 లక్షల మందికిపైగా టీకాలు వేయించుకున్నారు.

వీరిలో మరో మూడు లక్షల మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఆధార్‌కార్డు జీరాక్స్‌ కాపీ తీసుకెళ్లిన వారికి రిజిస్టర్‌లో పేరు నమోదు చేసుకుని టీకాలు వేసేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పని సరి చేసింది. అయితే, చాలా మందికి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌పై సరైన అవగాహాన లేదు. కుంటుంబ సభ్యులకు విడివిడిగా ఫోన్లు కూడా లేవు. ఒకే నెంబర్‌తో కుటుంబ సభ్యులందరి పేర్లు నమోదు చేస్తుండటంతో యాప్‌ నిరాకరిస్తోంది. ఇంటర్నెట్‌పై అవగాహన ఉన్న వారు స్వయంగా ఇంట్లోని కంప్యూటర్, సెల్‌ఫోన్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటుండగా... అవగాహన లేని వారు సమీపంలోని మీ సేవా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. మీసేవ నిర్వాహకులు దీన్ని అవకాశంగా తీసుకుని రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తుండటం గమనార్హం. 
 
బాధితులకు విషమ ‘పరీక్ష’ 
ఒక వైపు కరోనా వైరస్‌ నగరంలో చాపకింది నీరులా విస్తరిస్తుండగా..మరో వైపు ప్రభుత్వం టెస్టుల సంఖ్యను కుదించడం ఆందోళన కలిగిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు తదితర సమస్యలతో బాధపడుతూ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారికి నిరాశే మిగులుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 248 ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు.

ఒక్కో సెంటర్‌కు రోజుకు సగటున 150 మంది వరకు వస్తుండగా, కిట్ల కొరత వల్ల ప్రస్తుతం 50 మందికి మించి టెస్టులు చేయడం లేదు. 20 ప్రభుత్వ, 63 ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌లో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తుండగా, వీటిలో రోజుకు సగటున 25 వేల టెస్టులు చేస్తున్నారు. టెస్టింగ్‌ కేంద్రాల సామర్థ్యానికి మించి రోగులు వస్తుండటంతో రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం అవుతోంది. నిజానికి 12 నుంచి 24 గంటల్లోపే ఫలితం రావాల్సి ఉన్నా...48 గంటలు దాటినా రావడం లేదు. ఫలితంగా వైరస్‌ సోకిన వారే కాకుండా విదేశాలకు, రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారికి రిపోర్టుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మరో 1918 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.    

( చదవండి: కరోనా వేళ.. గుంపులు గుంపులుగా జనాలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు