ఒకటి వెనుక.. మరొకటి!

14 Aug, 2020 08:47 IST|Sakshi

యాంటీజెన్‌ టెస్టుల ఫలితాలపై అయోమయం 

కచ్చితత్వం కోసం మళ్లీ ఆర్టీపీసీఆర్, సీటీస్కాన్‌ పరీక్షలు 

హోం సర్వీసులు.. ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న ప్రజలు

కర్మన్‌ఘాట్‌కు చెందిన రాజేశ్వర్‌రావుకు ఇటీవల కోవిడ్‌–19 నిర్ధారణ అయింది. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన భార్య సహా ఇతర కుటుంబ సభ్యులు సరూర్‌నగర్‌ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు చేయించుకోగా రిపోర్ట్‌లో నెగిటివ్‌ వచ్చింది. అనుమానం వచ్చి ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకున్నారు. దీనిలో భార్య సహా ఇద్దరు కుమారులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

మన్సూరాబాద్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. కోవిడ్‌గా అనుమానించి స్థానికంగా ఉన్న బస్తీ దవాఖానాలో ర్యాపిడ్‌ టెస్టు చేయించగా.. నెగిటివ్‌ వచ్చింది. చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు ఆయనకు సిటీస్కాన్‌ చేశారు. ఈ రిపోర్ట్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇలా రాజేశ్వర్‌రావు, శ్రీనివాసరెడ్డిలకు మాత్రమే కాదు... ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చిన అనేక మందికి ఆ తర్వాత చేయించిన ఆర్టీపీసీఆర్, సిటీస్కార్‌ టెస్టుల్లో కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. 

సాక్షి, సిటీబ్యూరో: గాంధీ, ఉస్మానియా, నిమ్స్, సీసీఎంబీ, ఐపీఎం, ఫీవర్, రైల్వే ఆస్పత్రి, ఈఎస్‌ఐసీ, సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్‌ ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 16 ప్రభుత్వ, 23 ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌లో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. వీటికి రోజుకు 5500 నుంచి 6000 టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. హైకోర్టు సహా ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో జూలై 8 నుంచి యూపీహెచ్‌సీలు, బస్తీదవాఖానాల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 20, మేడ్చల్‌ మల్కజ్‌గిరి జిల్లాలో 79, హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 97 సెంటర్లలో యాంటీజెన్‌ టెస్టులు చేస్తున్నారు. వీటిలో రోజుకు సుమారు పది వేలకుపైగా టెస్టులు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టు రిపోర్ట్‌కు రెండు రోజుల సమయం పడుతుంటే, ర్యాపిడ్‌ టెస్టు రిపోర్ట్‌ కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో వస్తుంది. అయితే ఈ టెస్టులో వైరస్‌ నిర్ధారణలో 85 శాతమే 
కచ్చితత్వం ఉంటుంది. అదే ఆర్టీపీసీఆర్‌లో వైరస్‌ ప్రాథమిక దశలో ఉన్నా... పక్కా రిపోర్ట్‌ వచ్చేది. ర్యాపిడ్‌ టెస్టులో అలా ఉండక పోవడంతో మరింత స్పష్టత కోసం ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయించుకుంటున్నారు. ర్యాపిడ్‌ టెస్టుల ప్రారంభం తర్వాత ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను తగ్గించడంతో బాధితులు హోం సర్వీసులను, ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. 

మొబైల్‌ టెస్టింగ్‌ వెహికిల్స్‌పై స్పష్టత కరువు 
వైరస్‌ బారిన పడిన వారిని త్వరగా గుర్తించేందుకు ప్రభుత్వం ఇటీవల ఐదు మొబైల్‌ టెస్టింగ్‌ వెహికిల్స్‌ను ఏర్పాటు చేసింది. ఆయా వాహనాలు బస్తీల్లో పర్యటించి అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి, వెంటనే రిపోర్ట్‌లు జారీ చేస్తుంది. ఒక్కో మొబైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌లో రోజుకు సగటున 150 మందికి టెస్టులు చేస్తున్నారు. అయితే ఏ వాహనం.. ఏ రోజు ఏ బస్తీకి వస్తుందనే సమాచారం సిటీజనులకు చేరటం లేదు. ఈ టెస్టింగ్‌ వెహికల్‌ వచ్చిపోయిన విషయం కూడా బస్తీవాసులకు తెలియడం లేదు. వాహనాల రూట్‌మ్యాప్‌ను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో విధి లేని పరిస్థితుల్లో వారు స్థానికంగా ఉన్న ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు