సంక్రాంతికి సొంత ఊళ్లకు తరలుతున్న నగరవాసులు

12 Jan, 2021 07:56 IST|Sakshi

రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో పోటెత్తిన జనం

ఒక్క రోజే  500 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ

ఇప్పటికే 12 లక్షల మందికి పైగా పయనం

ఊరెళ్దాం..  
పల్లెందాలను ఆస్వాదిద్దాం . 
మట్టి పరిమళాలను ఆఘ్రాణిద్దాం.. 
సంక్రాంతి భోగి భాగ్యాలను ఆహ్వానిద్దాం..

రంగవల్లులు, గొబ్బెమ్మలతో 
మైమరిచిపోదాం.. 
గరికపోచలు, పిండిమొగ్గలు, రేగిపండ్లు, నవధాన్యాల కోసం బాల్యంలోకి 
పరుగులు పెడదాం.. 
పసందైన అరిసెలు, సకినాలు, 
లడ్డూలు, గారెలు ఆరగిద్దాం,... 
పొలంగట్లు, పంటచేలలో 
స్వేచ్ఛా విహంగాలై విహరిద్దాం.. 
పిల్లల్లో పిల్లలమై కేరింతలతో 
పతంగులు ఎగరేద్దాం 
ఊరూవాడా చుట్టేద్దాం..
దోస్తులతో ముచ్చటిద్దాం 
పల్లెకు పోదాం చలో చలో..
పండగ చేద్దాం చలో అంటూ .. 
పట్నం మూటా ముల్లే సర్దుకొని 
పల్లెకు బైలెల్లింది.. 
సంక్రాంతి, కనుమ తర్వాత 
తిరిగొస్తామంటూ బస్కెక్కింది.. 

సాక్షి, హైదరాబాద్‌: మహానగరం పల్లె బాట పట్టింది. ఏడాది పాటు కోవిడ్‌తో తీవ్ర ఒత్తిడికి గురైన నగరవాసులు సొంత ఊళ్లలో సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. గత వారం రోజులుగా సంక్రాంతి ప్రయాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. సోమవారం  ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. పండగ మరో రెండు రోజులే ఉండడంతో  తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు లక్షలాది మంది తరలి వెళ్లారు. కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా సీట్లు, బెర్తుల సామర్ధ్యం మేరకే  రైళ్లలో ప్రయాణం చేసేందుకు అనుమతినిస్తున్నారు. దీంతో నిర్ధారిత టికెట్లు లభించక లక్షలాది మంది వెయిటింగ్‌ లిస్టులోనే పడిగాపులు గాస్తున్నారు. చదవండి: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..4900 
► ఈసారి సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 4900 కు పైగా  ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాలకు  హైదరాబాద్‌ నుంచి  రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే సుమారు 3500 బస్సులకు ఇవి అదనం.  
► ఇప్పటి వరకు సుమారు 1500  ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు రద్దీ కొనసాగనుంది.  
► ప్రైవేట్‌ బస్సులు, సొంత వాహనాలు, ట్రావెల్స్‌ సంస్థలకు చెందిన మ్యాక్సీ క్యాబ్‌లలోనూ జనం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇప్పటి వరకు సుమారు 12 లక్షల మంది ఊళ్లకు వెళ్లినట్లు రవాణా వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: సంక్రాంతికి సొంతూరు వెళ్లడం కష్టమే!

రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు.. 
► నిర్ధారిత టికెట్‌ మేరకే అనుమతినివ్వడం వల్ల  వెయిటింగ్‌ లిస్టు జాబితా భారీగా నమోదవుతోంది. దీంతో వివిధ మార్గాల్లో రద్దీకి అనుగుణంగా  అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ► ఇప్పటి వరకు సుమారు 50 ప్రత్యేక రైళ్లను నడిపారు. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, మచిలీపట్నం,బెంగళూర్, చెన్నై, భువనేశ్వర్, తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.  
►  కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా రైళ్ల సంఖ్య పరిమితంగా ఉండడంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. టికెట్‌లు ఉన్నవాళ్లనే రైల్వేస్టేషన్‌లకు అనుమతివ్వడం వల్ల సాధారణ ప్రయాణికులు  జనరల్‌ బోగీల్లో వెళ్లలేకపోతున్నారు. గతేడాది కంటే రైళ్లలో వెళ్లే  ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో సాధారణ డిమాండ్‌తోనే రైళ్లు  రాకపోకలు సాగిస్తున్నాయి. ► ‘జనరల్‌ బోగీల్లో 75 మంది కూర్చొంటే కనీసం మరో 75 మంది నించొని  ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం కోవిడ్‌ దృష్ట్యా అందుకు అనుమతి లేకపోవడం వల్ల  సీట్ల సామర్ధ్యం మేరకే అన్ని రైళ్లు బయలుదేరుతున్నాయి.’ అని  దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

 

ఒక్క రోజే 500 ప్రత్యేక బస్సులు.. 
►  రైళ్లు పరిమితంగా ఉండడంతో బస్సులకు డిమాండ్‌ కనిపిస్తోంది. ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో జనం పెద్ద సంఖ్యలో బయలుదేరారు.  
►  సోమవారం ఒక్క రోజే 500 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.  
►  ఉప్పల్, ఎల్‌బీనగర్, జేబీఎస్, ఎంజీబీఎస్, మెహదీపట్నం తదితర ప్రాంతాలు ప్రయాణికులతో పోటెత్తాయి.  
► మరోవైపు సొంత కార్లు, బైక్‌లపైన సైతం తరలి వెళ్లారు.ఇమ్లీబన్‌ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ 

మరిన్ని వార్తలు