Photo Shoot: ఫొటోషూట్‌లో లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌.. ప్రస్తుతం జరుగుతోంది ఇదే

2 Jun, 2022 15:41 IST|Sakshi
ఫోటోగ్రఫీపై యువత ఆసక్తి

ఈ పదాలను సినిమా షూటింగ్‌లో నిత్యం వింటుంటాం. కానీ ఫొటోషూట్‌లోనూ ఈ పదాలు వినిపిస్తే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతోంది అదే. డ్రోన్, క్రేన్‌ షాట్స్‌తో సినిమా షూటింగ్‌ను తలపించేలా నగర శివారులో ఫొటోషూట్‌ చేయడం ట్రెండ్‌గా మారింది. చాలా మంది ఫొటోషూట్‌ను సినిమా షూటింగ్‌ అనే భ్రమపడుతున్నారు. దానికి సినిమా షూటింగ్‌ తరహాలో చేయడమే కారణమంటున్నారు ఫొటోగ్రాఫర్లు. అందుకే ఫొటోషూట్‌ను ఈ తరహాలో చేస్తున్నామని స్టుడియో నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఫొటోగ్రఫీపై ఆసక్తి (ఫొటోనాసక్తి) ఉన్న యువత తమ పనితనానికి మెరుగులు దిద్దుకుంటూ ఫొటోనాసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: గతంలో పెళ్లిళ్లు, పేరంటాలకు మాత్రమే ఫొటోలు తీయించుకునేవారు. ప్రస్తుతం పెళ్లితో పాటు ప్రీ–వెడ్డింగ్, పోస్ట్‌–వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫొటోగ్రాఫర్‌ స్వయంగా వెళ్లి తీయలేని యాంగిల్స్‌లో కూడా ఫొటోలను తీసే అవకాశం డ్రోన్‌ షాట్స్, క్రేన్‌ షాట్స్‌తో ఏర్పడుతోంది. అంతేకాకుండా సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆ వీడియోలను సినిమా పాటల తరహాలో ఎడిటింగ్‌ చేయించుకుంటున్నారు. అపురూపమైన ఈ ఫొటోలు, వీడియోలను కరిజ్మా, క్యాన్‌వేరా ఆల్బామ్, డీవీడీలలో పొందు పరిచి అందజేస్తున్నారు.  

సినిమా షూటింగ్‌ తరహాలో ఫోటో షూట్‌

రూ.70వేల నుంచి రూ.3.5లక్షల వరకు.. 
ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త ట్రెండ్‌లను నగర ప్ర జలు ఆహ్వానిస్తుండటంతో ఈ రంగంలోకి వచ్చే వారికి ఉపాధి లభిస్తోంది. ప్రీ–వెడ్డింగ్, పోస్ట్‌–వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లతో కలుపుని సినిమా ఫొటో గ్రఫీ, వీడియో క్యాన్‌వేరా, ఎల్‌ఈడీ స్క్రీన్స్, క్యాన్‌డెట్‌ ఫొటోగ్రఫీ ఆల్బంతో సహా మొత్తం క్వాలిటీని బట్టి దాదాపు రూ.70 వేల నుంచి రూ.3.5లక్షల వరకు ఫొటోగ్రాఫర్లు తీసుకుంటున్నారు. 

జవహర్‌నగర్‌లో 200 స్టూడియోలు, 3 కలర్‌ల్యాబ్‌లు 
ఫొటోగ్రఫీలో కొత్త ట్రెండ్‌లు రావడంతో పాటు మార్కెట్‌ రోజురోజుకు విస్తరించడంతో ఫొటోగ్రఫీ రంగంవైపు రావడానికి నేటితరం జవహర్‌నగర్‌ యువత ఆసక్తి చూపుతున్నారు. దానినే ఉపాధిగా మలుచుకుంటున్నారు. 15 ఏళ్ల క్రింద జవహర్‌నగర్‌ పరిసర ప్రాంతాలలో 5 నుంచి 10 ఫొటో స్టూడియోలు ఉండేవి. కానీ ప్రస్తుతం దాదాపు 200 వరకు ఫొటోస్టూడియోలు, 3 కలర్‌ల్యాబ్‌లు ఉన్నాయి. 

తక్కువ ఖర్చులోనే.. 
తక్కువ ఖర్చులోనే సినిమాను తలపించే రీతిలో అన్ని కోణాల్లో దశ్యాలను చిత్రీకరిస్తున్నాం. ఎక్కువ శాతం క్రేన్‌ షాట్స్‌ తీయాలని వినియోగదారులు కోరుతున్నారు. సీజన్‌లో గిరాకీ బాగుండటంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. 
–  శ్రీకాంత్‌యాదవ్, జవహర్‌నగర్‌  

ఎంతో మందికి ఉపాధి.. 
ఫొటో రంగంలోకి యువత రావడానికి ఇష్టపడుతున్నారు. నూతన టెక్నాలజీ ద్వారా షాట్స్‌ తీయడమే కాకుండా వారికి అనుకున్న రీతిలో ఫొటోఆల్బమ్‌ తీసి ఇస్తున్నాం. అంతే కాకుండా ఎంతో మంది ఉపాధిని కూడా పొందున్నారు. 
– సంపత్, అంబేడ్కర్‌నగర్‌

మరిన్ని వార్తలు