టెస్టులు సరే.. మరి భౌతిక దూరం ఏదీ?

18 Apr, 2021 11:11 IST|Sakshi

ముషీరాబాద్: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కరోనా కరాళ నృత్యం చేస్తూ విజృంభిస్తుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు ప్రాణ భయంతో  నిర్థారణ పరీక్షల కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు కరోనా నివారణకు వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు కూడా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు రోగులు వస్తుండడంతో పీహెచ్‌సీల వద్ద జనం రద్దీ పెరిగిపోతోంది. దీంతో పీహెచ్‌సీల వద్ద కనీస భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు, ఒకరిపై ఒకరు పడుతూ రిజిస్ట్రేషన్‌ల కోసం ఎగబడుతున్నారు. వీరిని నివారించేందుకు ఆసుపత్రి సిబ్బంది సైతం చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు కనీస సౌకర్యాలు లేక టెస్టులు, వ్యాక్సిన్‌ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

► ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బైబిల్‌ హౌస్, డీబీఆర్‌ మిల్లు, గగన్‌మహల్‌లతో పాటు ముషీరాబాద్, భోలక్‌పూర్‌లలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో కరోనా టెస్టులతో పాటు వ్యాక్సిన్‌ను కూడా అందిస్తున్నారు. 

► ముఖ్యంగా భోలక్‌పూర్, ముషీరాబాద్‌ కేంద్రాలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో పాటు ముషీరాబాద్‌ ప్రధాన రహదారిలో ఉండడంతో ఇక్కడ రద్దీ అధికంగా ఉంది. 

► ముషీరాబాద్, భోలక్‌పూర్‌ కేంద్రాలకు రోజుకు సగటున సుమారు టెస్టులకు, వ్యాక్సిన్‌కు 300 మందికి పైగా హజరవుతున్నారు. 

► టెస్టుల కోసం వచ్చే వారు మొదట రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత తమ సీరియల్‌ నెంబర్‌ వచ్చే వరకు సుమారు గంట పాటు ఆవరణలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి. 

► అలాగే వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత కూడా ఆరగంట పాటు ఎటువంటి రియాక్షన్‌ లేదని నిర్థారణ అయ్యే వరకు అక్కడ వేచిచూడాల్సి ఉంటుంది. దీనితో ఆ ప్రాంగణం కిటకిటలాడుతోంది.  

పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాటు చేయాలి.... 
► టెస్టులు, వ్యాక్సిన్‌ల కోసం వచ్చే బాధితులు, వారికి సహయకులుగా వచ్చే వారు క్యూ లైన్, భౌతిక దూరం పాటించే విధంగా ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసులు టీం లను ఏర్పాటు చేసి రోగులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. 

►   దీనికి తోడు  మహిళలకు టాయిలెట్‌ సౌకర్యం,  టెస్టులు, వ్యాక్సిన్‌ అందించే ఆరోగ్య కేంద్రాల వద్ద టెంట్‌లు, తాగునీరు,  సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. 

( చదవండి: ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని.. చిన్నారిని )

మరిన్ని వార్తలు