కోవిడ్‌ సేవింగ్స్‌!

11 Aug, 2020 07:59 IST|Sakshi

డబ్బులు ఖర్చు చేయకుండా ముందు జాగ్రత్తలు 

వాయిదాల పర్వంతో నెట్టుకొస్తున్న వైనం 

తప్పనిసరి అవసరాల కోసం మాత్రమే ఖర్చు 

నగరవాసుల్లో పెరిగిన పొదుపు 

ప్రైవేట్‌ ఆసుపత్రుల బిల్లులతోభయాందోళన 

వీకెండ్‌ మూవీల్లేవు. ఫ్రెండ్స్‌తో పార్టీలు బంద్‌. అప్పుడప్పుడు వచ్చి పోయే బంధుమిత్రుల సందడి లేదు.ఇంటిల్లిపాది కలిసి వెళ్లే సరదాటూర్లు లేవు. ‘రెస్టారెంట్‌’ అనే మాటమరిచారు. ఇల్లు దాటి బయటకు రావడానికి వంద రకాల సందేహాలు. ఇంటిల్లిపాదికి ఏవేవో అవసరాలు. ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. అయినా అన్నింటినీ వాయిదాపర్వంలోకి నెట్టేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే నగరవాసులు ‘కోవిడ్‌ సేవింగ్స్‌’ పాటిస్తున్నారు. ఉన్నదాంట్లో కొంతమొత్తాన్ని‘కోవిడ్‌ ముప్పు’ కోసంకేటాయిస్తున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: కంటికి కనిపించని శత్రువును ఎదుర్కొనేందుకు నగరవాసులు పొదుపు పాటిస్తున్నారు. మహమ్మారి కరోనా ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఏ క్షణంలో కబళిస్తుందో తెలియనిఅనిశ్చితి. ఐదు నెలలు గడిచినా వైరస్‌ ముప్పు తొలగలేదు. ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. మరోవైపు భరోసాను ఇవ్వలేకపోతున్న సర్కార్‌ దవఖానాలు, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రజల భయాందోళనను మరింత రెట్టింపు చేస్తున్నాయి. దీంతో చాలా మంది కొన్ని రకాల అవసరాలను సైతం  వాయిదా వేసుకొని కరోనా కోసం పొదుపు చేస్తున్నారు. దీంతో ఎవరి నోట విన్నా ‘కోవిడ్‌ సేవింగ్స్‌ అనే మాటే వినిపిస్తోంది. ఐదు నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి ప్రజల జీవన విధానంలో అనూహ్యమైన మార్పులు తెచ్చింది.  

ఉందిగా వాయిదాల పర్వం.... 
‘ వంట నూనెలు, పప్పులు, టీ పొడి, కాఫీ పొడి, పేస్టు వంటి నిత్యావసర వస్తువులే కావచ్చు. అవి తప్పనిసరిగా కొనుగోలు చేయవలసినవే అయినా జేబులోంచి డబ్బులు బయటకు తీస్తుంటే  భయమేస్తుంది....రేపేదైనా ఆపద వస్తే  ఎలా అనే ఆలోచన నిలువునా చుట్టేస్తుంది...’ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన అనిల్‌ ఆవేదన ఇది. ఓ కార్పొరేట్‌ కాలేజీ లెక్చరర్‌. కరోనా దృష్ట్యా పిల్లలకు  ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నాడు. పూర్తిగా కాకపోయినా జీతం వస్తోంది. కానీ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న తన ఒంటరి కుటుంబంలోకి  కరోనా తొంగి చూస్తే ఎలా అనే భయం వెంటాడుతోంది. ‘భోజనానికి, ఇంటి అద్దెకు, అవసరమైన మందుల కోసం తప్ప డబ్బులు ఖర్చు చేయడం లేదు. పిల్లలకు ఏదైనా కొనివ్వాలనిపించినా  

‘రేపేదైనా అయితే ఎలా...’ అనే భయం తన ప్రమేయం లేకుండానే అతన్ని  వాయిదా పర్వంలోకి నెట్టేస్తుంది. ఒక్క అనిల్‌ మాత్రమే కాదు. వివిధ రంగాల్లో పని చేస్తున్న  మధ్యతరగతి వర్గాలు అవసరాలన్నింటినీ వాయిదా వేసుకొని కోవిడ్‌ సేవింగ్స్‌ బాటలో పయనిస్తున్నాయి. సాధారణంగా  ఎవరైనా  భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు పాటిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత ఇల్లు వంటివి  దృష్టిలో ఉంచుకొని వచ్చే ఆదాయాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. బ్యాంకు రుణాలు తీసుకొని ఇళ్లు, స్థలాలు కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు నగరవాసులు ఏ క్షణంలో ముంచుకొస్తుందో తెలియని ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు మాత్రమే ఈ  పొదుపును  పాటిస్తున్నారు. 

ఇంటింటికీ ‘కోవిడ్‌ ఫండ్‌’... 
‘కారు చెడిపోయింది. ఇప్పటికిప్పుడు నాలుగు టైర్లు మార్చవలసిందే. కనీసం రూ.25 వేలు ఖర్చవుతుంది. కానీ  కారు కోసం అంత డబ్బు వెచ్చించడం దుస్సాహసమేమో అనిపిస్తుంది. మూడు నెలలుగా ఏదో ఒకవిధంగా నెట్టుకొస్తున్నాను...’ అని చెప్పారు బోడుప్పల్‌కు చెందిన ప్రశాంత్‌. ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ నిపుణుడిగా పని చేస్తున్నాడు. కోవిడ్‌కు ముందు జీవితం సంతోషంగా గడిచింది. వీకెండ్‌లో అందరూ కలిసి బయటకు వెళ్లేవారు. ఒక సినిమా, రెస్టారెంట్‌ లో డిన్నర్‌. పిల్లలకు నచ్చిన స్నాక్స్‌  తీసుకొని ఇంటికి వచ్చేవారు. ‘ఇప్పుడు ఆ సరదాలు పోయాయనే బాధ లేదు. కానీ కరోనా కోసమే డబ్బులు పొదుపు చేయవలసి రావడం చాలా బాధగా ఉంది. డెబిట్‌ కార్డు బయటకు తీయాలంటేనే భయమేస్తుంది.’ అని అంటారు. ప్రతి ఇంట్లోనూ  ‘ కోవిడ్‌ ఫండ్‌’ ఒక తప్పనిసరి అవసరంగా మారింది. నిత్యావసర వస్తువులు, తప్పనిసరి మందులు, అత్యవసర రవాణా ఖర్చులు  మినహా ఇతర అవసరాల కోసం డబ్బులు ఖర్చు చేయడం లేదు. మరోవైపు వివిధ రకాల వ్యాపార కార్యకలాపాలు స్తంభించడం వల్ల కూడా ఆయా రంగాలపైన ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వచ్చే కొద్దిపాటి  ఆదాయాన్ని సైతం కరోనా ముప్పును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు. 

రిఫ్రిజిరేటర్‌ వాయిదా వేసుకున్నాం 
ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ఈ టైమ్‌లో ఎందుకు అనిపిస్తుంది. ఏదో ఒక విధంగా ఈ ముప్పు నుంచి బయట పడితే చాలనిపిస్తోంది. రిఫ్రిజిరేటర్‌ చెడిపోయింది. కొత్తది కొనాల్సి వస్తుంది. కానీ 4 నెలల నుంచి వాయిదా వేసుకుంటున్నాం. – కల్పన, గృహిణి 

సరిపెట్టుకుంటున్నాం   
వారం, పది రోజులకు సరిపోయే నిత్యావసర వస్తువులు, కూరగాయలు మినహా మరో అవసరం కోసం ఖర్చు చేయడం లేదు. ఒకవేళ మధ్యలోనే కొన్ని వస్తువులు అయిపోయినా ఏదో ఒకవిధంగా సర్దుకుంటున్నాం.కానీ పదే పదే బయటకు వెళ్లి కొనుగోలు చేయడం లేదు. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందోతెలియదు కదా.  – వినయ్‌ వంగాల 

ఓన్లీ ఆహారం.. ఆరోగ్యం..
పౌష్టికాహారం తీసుకోవడం, అవసరమైన మందులు తెచ్చుకోవడం, శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్‌వాష్‌లు అవసరానికి అనుగుణంగా  కొనుగోలు చేయడం మినహా మరో ఆలోచన చేయడం లేదు. గతంలో బయటకు వెళితే తప్పనిసరిగా షోకేస్‌ వస్తువులు, ఎలక్ట్రిక్‌ వస్తువులు తెచ్చేవాణ్ణి, ఇంట్లో అందరం కలిసి
సరదాగా బయటకు వెళ్లేవాళ్లం.ఇప్పుడు అన్నీ బంద్‌.   – ప్రశాంత్, సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు 

మరిన్ని వార్తలు