హైదరాబాద్ వాసుల్లో విటమిన్ 'డీ' లోపం.. యువతలోనే ఎక్కువ.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

17 Feb, 2023 09:26 IST|Sakshi

‘డీ’ మన శరీరంలో ఉండాల్సిన ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, ఫాస్పరస్‌ వంటి ఇతర పోషకాలను శరీరం గ్రహించడంలో విటమిన్‌ డీ కీలక పాత్ర పోషిస్తుంది. మన ఎముకలలో 99% ఉన్న కాల్షియంను పునరుద్ధరించడానికి, సరిగా నిర్వహించడానికి సహాయపడుతుంది. కండరాల కదలికకు, మెదడు.. నరాల అనుసంధానానికి దోహదపడుతుంది. అంటువ్యాధులు, క్యాన్సర్, హృదయ, శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, చిత్తవైకల్యం వంటి వ్యాధుల బారిన పడకుండా కూడా తోడ్పడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక రోగనిరోధక వ్యవస్థ సక్రమ పనితీరుకు ఇది చాలా ముఖ్యమైనది. కరోనా కాలంలో ఇతరత్రా ఔషధాలతో పాటు డీ విటమిన్‌ను వైద్యులు సిఫారసు చేయడం గమనార్హం.

ఇంతటి  కీలకమైన విటమిన్‌ ‘డీ’లోపం హైదరాబాద్‌ నగరవాసుల్లో తీవ్ర స్థాయిలో ఉందని టాటా ఐఎంజీ లాబ్స్‌ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 75 శాతానికి పైగా ప్రజలు విటమిన్‌ డీ లోపంతో  బాధపడుతున్న నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఒకటని తేల్చింది. హైదరాబాద్‌లో 76% మంది ప్రజలు ‘డీ’ విటమిన్‌ లోపంతో బాధపడుతున్నారని తెలిపింది.

 

నగరాల్లో.. యువతలో.. 
అధ్యయనం ప్రకారం.. వదోదర (89%), సూరత్‌ (88%) అహ్మదాబాద్‌ (85%) నగరాలకు చెందిన ప్రజలు అత్యధికుల్లో విటమిన్‌ డీ లోపం ఉంది. అంతేకాదు పెద్దవారితో పోలిస్తే యువతలో ఈ లోపం ఎక్కువగా ఉంది. 25 ఏళ్లలోపు వారు 84% మందిలో, 25–40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 81% మందిలో ‘డీ’ విటమిన్‌ సరిగా లేదని అధ్యయనం తేలి్చంది. నేటి తరం పిల్లలు, యువకులు ఎండ తగలకుండా ఎక్కువ సమయం ఇళ్లు, కార్యాలయాల్లోపలే గడుపుతుండడం, సరైన ఆహార నియమాలు పాటించక పోవడమే ఇందుకు కారణ­మ­ని ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు. నగరాల్లో అత్యధికులు కరోనా కా­ర­ణంగా చాలాకాలం పాటు నాలు­గ్గోడల మధ్యే గడిపారు.

అంటే విటమిన్‌ డీ లో­పానికి పరోక్షంగా కరోనా కూడా కారణమైంది. ఇటీవల పెద్ద సంఖ్యలో యువకులు తీవ్రమైన ఒళ్లు నొప్పులు, నిస్సత్తువతో ఆసుపత్రులకు వస్తున్నారని, వీరిలో ఎక్కువమంది అవుట్‌ డోర్‌ యాక్టివిటీ తగ్గిపోయినవారేనని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. విటమిన్‌ డీ లోపం వల్ల శరీరంలో కాల్షియం స్థాయి­లు తగ్గి­పో­యి బోలు ఎముకల వ్యాధికి లేదా ఆ్రస్టియోపోరోసిస్‌కు దారి తీస్తోందని, ఇది ఇటీవలి సంవత్సరాలలో వయసులకు అతీతంగా కనిపిస్తోందని పేర్కొంటున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధుల భారాన్ని విటమిన్‌ డీ లోపం రెట్టింపు జేస్తుందని వివరిస్తున్నారు. కీళ్ల నొప్పులకు, రక్తంలో చక్కెర శాతం పెరగడానికి కూడా కారణమవుతోందని అంటున్నారు.  

సహజసిద్ధంగానే భర్తీ చేసుకోవాలి 
వీలైనంత వరకు సహజమైన పద్ధతుల్లోనే విటమిన్‌ డీ లోటును భర్తీ చేసుకోవాలి. కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సమస్య పరిష్కారం కాకపోతే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.  
– డా.గౌరీశంకర్‌ బాపనపల్లి, మెడికల్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి, హైదరాబాద్‌ 

ఇంకెలా పొందగలం? 
కొన్ని రకాల ఆహార ఉత్పత్తుల ద్వారా స్వల్పంగా విటమిన్‌ డీని పొందవచ్చు. పాలకూర వంటి ఆకుకూరలు, సోయా బీన్స్, వైట్‌ బీన్స్, సాల్మన్, రెయిన్‌బో వంటి కొవ్వుతో కూడిన చేపలు, నారింజ రసం, ఓట్‌ మీల్‌ వంటి వాటితో విటమిన్‌ డీ లభిస్తుంది. అలాగే విటమిన్‌ డీలో కీలకమైన డీ3, డీ2లు సప్లిమెంట్స్‌ (టాబ్లెట్లు) రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండూ విటమిన్‌ డీ లోపాన్ని సరిచేయడంలో సహాయపడతాయి, అయితే ప్రభావంతంగా పని చేస్తుందని వైద్యులు ఎక్కువగా డీ3ని సిఫారసు చేస్తారు  

రెండు దశల జీవ రసాయన ప్రక్రియ కీలకం 
సూర్యరశ్మి లేదా సప్లిమెంట్‌ నుంచి విటమిన్‌ డీని పొందిన తర్వాత దానిని క్రియాశీల విటమిన్‌ డీగా మార్చడానికి రెండు దశల జీవ రసాయన ప్రక్రియ దోహదపడుతుంది. ఇది కాలేయం నుంచి మొదలై మూత్రపిండాల్లో ముగుస్తుంది. మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు అడ్వాన్స్‌ దశలో ఉన్న వారు ఇది గమనంలో ఉంచుకోవాలి. శరీరం విటమిన్‌ డీని సరిగా సంగ్రహించలేనప్పుడు దాని లోపం ఏర్పడుతుంది. తగినంత విటమిన్‌ డీ లేకపోతే శరీరం ఆహారం నుంచి కాల్షియంను గ్రహించదు.

సగటు ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎముకల నుంచి ప్రతిరోజూ 500 మిల్లీగ్రాముల కాల్షియంను కోల్పోతాడు అదే మొత్తాన్ని డీ విటమిన్‌ ద్వారా ఉత్పత్తి చేసుకున్న కాల్షియంతో భర్తీ చేసుకుంటాడు. విటమిన్‌ డీ లోపం ఉన్నప్పుడు కాల్షియం తగినంతగా భర్తీ కాదు. ఇది ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారడానికి దారితీస్తుంది.
చదవండి: ఆహా ఏమి రుచి.. అంకాపూర్ దేశీ కోడి కూరకు 50 ఏళ్లకు..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు