గేమ్‌.. ఫినిష్‌!

30 Jul, 2020 08:54 IST|Sakshi

పబ్‌జీకి సిటీలో అత్యంత ఆదరణ  

దేశ భద్రత దృష్ట్యా బ్యాన్‌ను ఆహ్వానిస్తున్న గేమింగ్‌ లవర్స్‌ 

గతంలో 59 చైనా యాప్స్‌ను బ్యాన్‌ చేసిన కేంద్రం  

ప్రస్తుతం పబ్‌జీ తదితర గేమింగ్‌ యాప్స్‌పై నిషేధం విధించే అవకాశం 

ఆన్‌లైన్‌ గేమింగ్‌... మన దేశంలో పదేళ్లుగా ఇది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు 300 మిలియన్‌ ఆన్‌లైన్‌ గేమర్స్‌తో 6,200 కోట్ల మార్కెట్‌ వాల్యూ ఉన్న దేశం కావడమే దీనికి నిదర్శనం. అయితే ఈ మధ్య చైన్‌నాకు చెందిన ఆన్‌లైన్‌ తదితర పలు యాప్స్‌తో  దేశ భద్రత, సమగ్రతలకు ముప్పు వాటిళ్ల వచ్చని కేంద్రం పసిగట్టింది. దాంతో నెల క్రితం చైనాకు చెందిన 59 యాప్స్‌ను బ్యాన్‌ చేయగా, ప్రస్తుతం మరో 47 గేమింగ్‌ తదితర యాప్స్‌పై నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో విశేష ఆదరణ పొందిన టిక్‌టాక్‌ గతంలో బ్యాన్‌ కాగా... ఇప్పుడు యూత్‌లో క్రేజీగా మారిన పబ్‌జీ బ్యాన్‌ కానుంది.

దేశంలో కొద్ది కాలంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌కు క్రేజ్‌ బాగా పెరిగింది. అంతర్జాల సేవలు అతి చౌకగా అందుబాటులోకి రావడంతో మొబైల్‌ గేమింగ్‌ మరింత విస్తృతమైంది. ఎంతగా అంటే సీఏజీఆర్‌ సూచికలో ఈ రంగం 22 శాతం అభివృద్ధి చెంది, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు కల్పవృక్షంగా మారింది ఇండియా. 2010లో కేవలం 25 ఆన్‌లైన్‌ గేమ్‌ డెవలప్‌ కంపెనీలు ఉండగా.. ప్రస్తుతం 275 దాటింది. ఈ గేమింగ్‌ రంగం 2019 సంవత్సరానికి ఏకంగా 1 బిలియన్‌ ఆదాయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆన్‌లైన్‌ గేమ్స్‌ను ఆదరించే వారిలో ఎక్కువగా యువతే అయినా పిల్లలు, పెద్దలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సిటీలో అత్యంత ఆదరణ పొందిన పబ్‌జీ ప్రియులు బ్యాన్‌ కారణంగా కొద్దిపాటి నిరుత్సాహానికి గురకానున్నారు. 

క్రేజీ.. పబ్‌జీ... 
ప్రస్తుతం చాలామంది మెదల్లలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే... పబ్‌జీ బ్యాన్‌...?  దేశంలో ఈ ఆన్‌లైన్‌ గేమ్‌కు ఉన్న ఆదరణ అసాధారణం.  ఇండియాలో 2018 నుంచి బాగా పాపులర్‌ అయిన ఈ గేమ్‌ రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక పబ్‌జీ ప్లేయర్స్‌ (116మిలియన్‌ డౌన్‌లోడ్స్‌) కలిగిన దేశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 555 మిలియన్‌ పబ్‌జీ ప్లేయర్స్‌ ఉండగా మన దేశంలోనే 22% ఉన్నారు.  ‘‘ప్లేయర్‌ అన్నోన్స్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌’’ అనేది దీని అనలు పేరు. ఇది ముందుగానే ప్రోగ్రామింగ్‌ చేయబడిన ఆట కాదు. కళ్ల ముందే జరుగుతుందా అనిపించే లా మనతో లైవ్‌ ప్రోగ్రామింగ్‌ చేయబడే నెట్టింటి ఆట. 

ఒకేసారి 100 మంది పాల్గొనవచ్చు
ఈ గేమ్‌లో ఒకే సారి 100 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా దాగి ఉన్న శత్రువులను గుర్తించి, తమ వద్ద ఉన్న ఆయుధాలతో సంహరించాలి. ఇందులో కొద్దిమంది స్నేహితులు టీంగా ఏర్పడి శత్రువులపై దాడి చేయొచ్చు. ఆటగాడు చనిపోయేంత వరకు ఆడే అవకాశం ఉంటుంది. చివరి ఆటగాడు మిగిలేంత వరకు ఆట కొనసాగుతుంది. ఈ గేమ్‌లోని అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్‌ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఎంతలా అంటే... విపరీతంగా ఆడుతున్నాడని కట్టడి చేసినందుకు ఆత్మహత్య చేసుకున్న పిల్లలు కూడా ఉన్నారు, కన్నతండ్రినే కడతేర్చిన యువకులూ ఉన్నారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం దేశ భద్రత దృష్ట్యా ప్రముఖ ఆన్‌లైన్‌ యాప్స్‌ లూడో వరల్డ్, రెస్సో, జిలీ, అలీఎక్స్‌ప్రెస్‌లతో పాటు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు గుండెకాయలాంటి  పబ్‌జీనీ బ్యాన్‌ చేయాలని అనుకుంటున్నారు. 

పబ్‌జీ విజేతలుగా నగర ప్లేయర్స్‌  
దీంతో దేశీయంగా ఆన్‌లైన్‌ గేమ్‌ డెవలపర్స్‌కి ప్రాధాన్యత పెరిగింది.  బెంగళూర్‌ (సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా), హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ స్టార్టప్‌ కంపెనీలు రాణిస్తున్నాయి.  ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కూడా పబ్‌జీ ప్లేయర్స్‌కు కొదవ లేదు. గతంలో నేషనల్‌ పబ్‌జీ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన ప్లేయర్స్‌ విజేతలుగా గెలిచారు. అంతే కాకుండా ఇండియన్‌ పబ్‌జీ మొబైల్‌ టోర్నమెంట్‌ గ్రాండ్‌ ఫైనల్‌ను హైదరాబాద్‌ వేదికగా జరిపిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడి యువత దేశ సమగ్రత దృష్ట్యా బ్యాన్‌ను ఆహ్వానిస్తున్నప్పటికీ పబ్‌జీకి బానిస అయిన టీనేజర్స్‌ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఆటకు ప్రత్యామ్నాయం... 
ప్రస్తుత బ్యాన్‌ దేశ రక్షణకు, అభివృద్ధికి భవిష్యత్‌కు మేలు చేసేది కాబట్టి ఈ నిర్ణయాన్ని అధిక శాతం ప్రజలు ఆమోదిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు.  అందులో భాగంగా అత్యధికులు ఫ్రీఫైర్‌ను ఎంచుకొంటున్నారు. దానితో పాటు మంచి షూటర్‌ ఫైర్‌ గేమ్‌గా నిలిచిన కాల్‌ ఆఫ్‌ డ్యూటీ, ఏఆర్‌కే సర్వైవల్‌ ఎవాల్వ్‌డ్‌ అడ్వెంచరస్‌ను, కాస్త పబ్‌జీని పోలిన ఫోర్ట్‌నైట్‌ను, యుద్ధరంగాన్ని ప్రతిబింబించే బాటిల్‌ ల్యాండ్స్‌ రాయల్, జెడ్‌1 బాటిల్‌ రాయల్‌ యాక్షన్‌ గేమ్స్‌వైపు మరలుతున్నార

అడిక్ట్‌ కానంత వరకూ ప్రమాదం లేదు... 
రెండేళ్లుగా పబ్‌జీ ఆడుతున్న. ఇందులో ఉన్న యాక్షన్, సస్పెన్స్, థిల్లర్‌ నన్ను బాగా ఆకట్టుకొంది. నా ఫ్రెండ్స్‌తో ఆన్‌లైన్‌లో ఒక టీమ్‌గా ఈ గేమ్‌ ఆడతాం. ఈ ఆటతో మంచి ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు కాన్సంట్రేషన్‌ పెరుగుతుంది. ఏదైనా సరే అడిక్ట్‌ కానంత వరకూ ప్రమాదం లేదు. బ్యాన్‌ నిర్ణయం అసంతృప్తిని కలిగించినా దేశం కోసం ఈ గేమ్‌ని వదులుకోడానికి సిద్ధంగా ఉన్నా.      –సంతోష్, కూకట్‌పల్లి.  

బ్యాన్‌ నిర్ణయాన్ని అభినందిస్తున్నా... 
నాకు ఆన్‌లైన్‌ గేమ్స్‌ అంటే ఎంతో ఇష్టం. అందులోనూ లూడో, పబ్‌జీ అంటే చాలా ఆసక్తి. అయితే  దేశ అంతరంగిక భద్రత,  వ్యక్తిగత సమాచార భద్రతకు ఆటంకం వాటిల్లుతోందని ఈ గేమ్స్‌ను బ్యాన్‌ చేయాలనే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. స్కూల్‌ పిల్లలు, టీనేజర్స్‌ వీటి నుంచి బయటపడటానికి కొంచెం సమయం పడుతుంది. అడిక్ట్‌ అయిన పిల్లల విషయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.       –ఉమ, యాప్రాల్‌   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు