హైగ్రేడ్‌ ఎండీఎంఏ డ్రగ్‌ ఖరీదు ఎంతో తెలుసా? బంగారాన్ని మించిన ధర 

15 Feb, 2023 12:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో గ్రాము బంగారం రేటు రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంటోంది. మహారాష్ట్రలోని ముంబై నుంచి సిటీకి సరఫరా అవుతున్న హైగ్రేడ్‌ ఎండీఎంఏ డ్రగ్‌ ఖరీదు ఎంతో తెలుసా..? ఏకంగా గ్రాము రూ.10 వేలు. వ్యవస్థీకృతంగా ఈ డ్రగ్‌ నెట్‌వర్క్‌ నడిపిస్తున్న అంతరాష్ట్ర సరఫరాదారుడిని హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు పట్టుకున్నారు. ఇతడికి హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.

డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి మంగళవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ముంబైలోని అంథేరీ వెస్ట్‌ ప్రాంతంలో నివసించే మిరాజ్‌ కాజీ అక్కడి పబ్స్‌కు వెళ్లే క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. తానూ ఇదే దందా చేయాలని నిర్ణయించుకుని ఆ నగరంలో ఉన్న డ్రగ్‌ సప్లయర్‌ సూరజ్‌ గోస్వామితో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇతడి నుంచి హోల్‌సేల్‌గా కొంటూ ముంబైతో పాటు హైదరాబాద్‌లో ఉన్న అనేక మంది వినియోగదారులకు రిటైల్‌గా అమ్ముతున్నాడు.

హైక్వాలిటీ ఎండీఎంఏ డ్రగ్‌ను గ్రాము రూ.10 వేల చొప్పున విక్రయిస్తున్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి అందించడం కోసం 40 గ్రాముల ఎండీఎంఏ తీసుకున్న మిరాజ్‌ ఇక్కడకు చేరుకున్నాడు. దీనిపై హెచ్‌–న్యూ ఇన్‌స్పెక్టర్‌ పి.రమేష్‌రెడ్డికి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సై సి.వెంకట రాములు తన బృందంతో నిఘా ఉంచారు. చార్మినార్‌ ప్రాంతంలో మిరాజ్‌ ఉన్నాడన్న సమాచారం అందుకుని వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి రూ.4 లక్షల విలువైన డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న గోస్వామి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇతడి నుంచి ఈ మాదకద్రవ్యాన్ని సిటీలో ఎవరెవరు ఖరీదు చేస్తున్నారు? వాళ్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? తదితర అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడితో పాటు స్వా«దీనం చేసుకున్న డ్రగ్‌ను చార్మినార్‌ పోలీసులకు అప్పగించారు.  

ఒక్కో ట్రిప్పు.. రూ. 50 వేలు
ముంబైలోని మూతపడిన కర్మాగారాల్లో తయారవుతున్న ఎండీఎంఏ డ్రగ్‌ దేశ వ్యాప్తంగా అనేక మెట్రో నగరాలకు సరఫరా అవుతోంది. దీనికోసం ప్రత్యేకంగా నెట్‌వర్క్‌ పని చేస్తోంది. ఈ డ్రగ్‌ను తరలించే క్యారియర్లను ఒక్కో ట్రిప్పుకు రూ.50 వేల చొప్పున సరఫరాదారులు చెల్లిస్తున్నారు. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు అరెస్టు చేసిన ఏడుగురు నిందితుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందిదని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. 

ఏఓబీ టు ముంబై 
సింథటిక్‌ డ్రగ్స్‌ ముంబై నుంచి నగరంతో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాలకు సరఫరా అవుతున్నాయి. ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ) నుంచి హైదరాబాద్‌ మీదుగా ముంబైకి గంజాయి సరఫరా అవుతోంది. ఈ దందా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాకు ఈస్ట్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు చెక్‌ చెప్పారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. 

ముంబైలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన భార్యభర్తలు బిల్కిస్‌ మహ్మద్‌ సులేమాన్, అలీ సాగర్‌ సైఫుద్దీన్‌ రాంపుర్‌వాలా కొన్నేళ్లుగా గంజాయి దందాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఏడు, మరొకరిపై 15 కేసులు నమోదయ్యాయి. ఏఓబీలో గంజాయి పండించే శ్రీనివాస్‌ నుంచి గంజాయి ఖరీదు చేసే రకీబ్‌ అనే ముంబై వాసి అక్కడి విక్రయిస్తున్నాడు. బిక్విస్, సైఫుద్దీన్‌ తమకు పరిచయమైన జహీరాబాద్‌కు చెందిన ముర్తుజా షేక్‌ ద్వారా రకీబ్‌ను సంప్రదించారు. తమకు, గంజాయి పండించే వారికి మధ్య దళారిగా ఉండాలని కోరడంతో ఇతడు అంగీకరించాడు.

శ్రీనివాస్‌ నుంచి ఖరీదు చేసిన 110 కేజీల గంజాయిని మంబై తరలించడానికి రకీబ్‌... అబ్దుల్‌ అనే వ్యక్తికి చెందిన కారు రూ.20 వేలకు అద్దెకు మాట్లాడుకున్నారు. ఈ సరుకు తీసుకురావడానికి అబ్దుల్‌ తన భార్య హసీనాతో కలిసి ఏఓబీకి వెళ్లాడు. శ్రీనివాస్‌ను కలిసి 110 కిలలో గంజాయి తీసుకొని కారు సీట్‌ కింద ప్యాకెట్ల రూపంలో దాచాడు. ముంబై వెళ్తూ ఇమ్లీబన్‌ దగ్గర ఆగి 20 కిలోలు జహీరాబాద్‌కు పంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిపై ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.సంతోష్‌ కుమార్‌కు సమాచారం అందింది. దీంతో వలపన్నిన అధికారులు ఈ అక్రమ రవాణా గుట్టురట్టు చేసి బిలి్కస్, సైఫుద్దీన్‌ , ముర్తుజా షేక్‌లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు.  

మరిన్ని వార్తలు