నన్ను పట్టుకోలేరు

17 Feb, 2022 02:12 IST|Sakshi
సూరి గ్యాంగ్‌ అరెస్టును చూపిస్తున్న పోలీసులు   

కిడ్నాపర్‌ సూరి సవాల్‌ 

డాన్‌ కో పకడ్నా ముష్కిల్‌ హీ నహీ, నా ముమ్కిన్‌ హై  

అప్పట్లో తన వాట్సాప్‌ స్టేటస్‌గా ఈ డైలాగ్‌ 

బాధితులకు అతడో ‘రక్షకుడు’ అనే భావన 

ఫలితంగా వాళ్లే సమాచారం ఇస్తున్న వైనం

సాక్షి, సిటీబ్యూరో: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన మనీ హెయిస్ట్‌ తొమ్మిది సీజన్లను తీక్షణంగా వీక్షించి.. తాను అందులోని ప్రొఫెసర్‌ క్యారెక్టర్‌గా ఫీల్‌ అవుతూ.. సిండికేట్‌ ఏర్పాటు చేసుకుని మరీ వరుస కిడ్నాప్‌లకు పాల్పడిన గుంజపోగు సురేష్‌ అలియాస్‌ సూరి వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడు ఇటీవలి కాలంలో పలుమార్లు పోలీసులకు చిక్కకుండా త్రుటిలో తప్పించుకున్నాడు.

ఆ సందర్భాల్లో పోలీసులు తన వాట్సాప్‌ స్టేటస్‌ చూస్తారని ఊహించాడు. దీంతో డాన్‌ చిత్రంలోని ‘డాన్‌ కో పకడ్నా ముష్కిల్‌ హీ నహీ, నా ముమ్కిన్‌ హై’ (డాన్‌ పట్టుకోవటం కష్టమే కాదు, అసాధ్యం కూడా) అనే డైలాగ్‌ను స్టేటస్‌గా పెట్టి సవాల్‌ విసిరాడు. సూరిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన ఆసిఫ్‌నగర్‌ పోలీసులు అయిదు రోజుల కస్టడీకి కోరుతూ బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. 

సంకల్పం చెదరకూడదని పచ్చబొట్టు... 
భోజగుట్ట ప్రాంతానికి చెందిన సూరి డిగ్రీ పూర్తి చేశాడు. పోలీసు అధికారి అవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. తన అన్న సుధాకర్‌కు ఉన్న నేరచరిత్ర నేపథ్యంలో తన దృష్టి మళ్లకుండా, సంకల్పం చెదరకుండా ఉండటానికి టాటూ వేయించుకోవాలని భావించాడు. 2006లో కుడి చేతిపై పోలీసు బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. తన అన్న ప్రభావంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అలవాటుపడిన ఇతగాడు 2011 నుంచి నేరాలు చేయడం ప్రారంభించాడు.

మరో చేతిపై ఓ సినీ నటుడి ఫొటోను టాటూగా వేయించుకున్న సూరి ఆయన మాదిరిగానే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఓ ట్రావెల్స్‌ కార్యాలయంలో డ్రైవర్‌గా పని చేయడంతో డ్రైవింగ్‌పై మంచి పట్టువచ్చింది. సెకండ్‌ హ్యాండ్‌ పజేరో వాహనం ఖరీదు చేసిన ఇతగాడు నేరం చేసినప్పుడు, ఆ తర్వాత వీలున్నన్ని రోజులు అందులోనే గడిపేవాడు.  

స్టీరింగ్‌పై ఉంటే చిక్కడం దుర్లభం... 
రేసర్లను తలదన్నుతూ డ్రైవింగ్‌ చేసే సూరి కారు డ్రైవింగ్‌ సీటులో ఉంటే మాత్రం పట్టుకోవడం ఎవరితరం కాదు. ఇతడిని ఫోన్‌ నంబర్‌ ఆధారంగా పట్టుకోవడానికి గతంలో సదాశివపేట, విజయవాడ పోలీసులు ప్రయత్నించారు. ఆ సందర్భంల్లో దాదాపు కిలోమీటరు దూరంగా కారును రివర్స్‌లో అత్యంత వేగంగా నడిపి తప్పించుకున్నాడు. మరోసారి పోలీసులపైకే కారు పోనిచ్చి ఉడాయించాడు.

ఈ సందర్భాల్లో తన వాట్సాప్‌ స్టేటస్‌గా డాన్‌ సినిమా డైలాగ్‌ పెట్టాడు. పది రోజులకు పైగా గాలించిన ఆసిఫ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రవీందర్‌ నేతృత్వంలోని బృందం ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టింది. ఓ టోల్‌గేట్‌ వద్ద కారులో నిద్రిస్తున్న సూరిని గుర్తించింది. మూడు గంటలు శ్రమించి ఆ వాహనం చుట్టూ ఇతర వాహనాలు ఆపి పట్టుకోగలిగింది. 

బిహారీ మాదిరిగా బిల్డప్‌.. 
స్నేహితులకు స్నేహితులో, పరిచయస్తులనో మాత్రమే టార్గెట్‌గా చేసుకుని, యువతితో డేటింగ్‌ ట్రాప్‌ వేయించి కిడ్నాప్‌ చేసే సూరి తాను కిడ్నాప్‌ చేసిన వారి వద్ద బిహారీ మాదిరిగా బిల్డప్‌ ఇస్తాడు. తాను కనిపించకుండా అనుచరులతో కిడ్నాప్‌ చేయిస్తాడు. ఆపై వారికి కళ్లకు గంతలు, ముఖానికి తొడుగులు వేశాకే రంగంలోకి దిగుతాడు. బాధితులతో హిందీలో మాట్లాడుతూ బిహార్‌కు చెందిన కిడ్నాపింగ్‌ గ్యాంగ్‌గా నమ్మిస్తాడు.

వారి కుటుంబీకుల నుంచి డబ్బు ముట్టిన తర్వాత ప్లేట్‌ ఫిరాయిస్తాడు. తానే అతికష్టమ్మీద కిడ్నాపర్ల నుంచి రెస్క్యూ చేసినట్లు బిల్డప్‌ ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే అనేక మంది బాధితులు పోలీసుల కదలికలపై ఇతడికే సమాచారం ఇస్తూ వచ్చారు. ఇతడిని పట్టుకున్న తర్వాత పోలీసులు వారితో సూరినే కిడ్నాపర్‌ అని చెప్పినా కొందరు నమ్మలేదు. పొడవాటి గడ్డం, సిగతో కూడిన తలకట్టు, జీన్స్, టీషర్ట్స్‌తో తిరిగే సూరి ప్రతి అంశంలోనూ ఎవరో ఒకరిని స్ఫూర్తిగా తీసుకున్నాడని, నడిచిన మార్గం మాత్రం సరైంది కాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు