గాంధీ ఆస్పత్రి ఉదంతం..పోలీస్‌.. కేర్‌లెస్‌!

21 Aug, 2021 09:50 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఉమామహేశ్వర్‌రావు.. గాంధీ ఆస్పత్రికి చెందిన సాధారణ ఉద్యోగి. ఈ నెల 11న ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌తో ఆస్పత్రి ఆవరణలో తనకు కనిపించిన సువర్ణను (చెల్లెలు) బాధ్యతగా లేడీ గార్డ్‌కు అప్పగించి వెళ్లాడు.  
► ముషీరాబాద్‌ ఠాణా.. బాధ్యతాయుతంగా ఉండాల్సిన పోలీసులు. అదే రోజు రాత్రి ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌తో తమ ఠాణాకు వచ్చిన తిరుపతమ్మను (అక్క) గంటకుపైగా ఉంచి నిర్లక్ష్యంగా రోడ్డుపై వదిలేశారు.  
► గాంధీ ఆస్పత్రి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన అక్కాచెల్లెళ్ల వ్యవహారంలో సాధారణ ఉద్యోగి స్పందనకు, పోలీసుల వ్యవహారానికి తేడా చూపించే మచ్చుతునకలు ఇవి. ముషీరాబాద్‌ పోలీసులు చేసిన పని కారణంగానే నగర పోలీసు విభాగంలోని దాదాపు అన్ని బలగాలూ మూడ్రోజుల పాటు రాత్రనకా పగలనకా రోడ్లపై తిరగాల్సి వచ్చింది. 
అదే రోజు ఠాణాకు..  
► మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు తిరుపతమ్మ, సువర్ణ ఈ నెల 11నే ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌కు లోనయ్యారు. దీని ప్రభావంతో వింతగా ప్రవర్తించడం మొదలెట్టారు. మధ్యాహ్నం 3.14 గంటలకు గాంధీ ఆస్పత్రి నుంచి బయలుదేరిన తిరుపతమ్మ రాత్రి 7 గంటల ప్రాంతంలో ముషీరాబాద్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి గలభా సృష్టించింది. దీంతో స్థానికులు డయల్‌–100కు సమాచారం ఇవ్వడంతో ముషీరాబాద్‌ ఠాణాకు చెందిన గస్తీ వాహనం వెళ్లి ఆమెను తీసుకుని పోలీసుస్టేషన్‌కు వచ్చింది.  
► రాత్రి 7.30 గంటల నుంచి దాదాపు గంట పాటు ఆమెను స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు ఆపై నిర్లక్ష్యంగా రోడ్డుపై వదిలేశారు. ఎవరైనా మహిళలు ఈ రకంగా పోలీసులకు తారసపడితే సంబంధీకుల్ని గుర్తించి అప్పగించాలి. అలాంటి వాళ్లు ఎవరూ లేరనో, తాము వెళ్లమనో బాధితులు అంటే స్టేట్‌హోమ్‌కు తరలించాలి. మానసిక స్థితి సరిగ్గా లేని తిరుపతమ్మ లాంటి వాళ్లు కనిపిస్తే లేఖ రాయడం ద్వారా మానసిక చికిత్సాలయానికి పంపాలి. నిబంధనలు ఈ విషయాలు చెబుతున్నా ముషీరాబాద్‌ పోలీసులు మాత్రం ఆమె నడిరోడ్డుపై వదిలేశారు. 

మిన్నకుండిపోయిన ఆ పోలీసులు..  
► ‘గాంధీ ఆస్పత్రి’ ఉదంతం ఈ నెల 16న వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి నగర పోలీసు విభాగానికి చెందిన దాదాపు అన్ని విభాగాల అధికారులు రోడ్లపై పడ్డారు. ఫిర్యాదు చేసిన సువర్ణ భరోసా కేంద్రం అధీనంలోనే ఉండగా.. కనిపించకుండా పోయిన ఆమె అక్క తిరుపతమ్మ ఆచూకీ కోసం నిద్రాహారాలు మానేసి అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంపై నగరం మొత్తం హల్‌చల్‌ నడుస్తోంది.  
► దీనికి ముందే చిలకలగూడ పోలీసులు తిరుపతమ్మపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేసి అన్ని ఠాణాలకు పంపారు. ఇంత జరుగుతున్నా.. ఆమెను ఠాణాకు తీసుకువచ్చి గాలికి వదిలేసిన ముషీరాబాద్‌ పోలీసులు మాత్రం కిక్కురుమనలేదు. తమకు ఏమీ తెలియదన్నట్లే వ్యవహరించారు. తిరుపతమ్మ ఆచూకీ కోసం సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం ఈ విషయం గుర్తించి నిలదీయడంతో ముషీరాబాద్‌ పోలీసులు అసలు విషయం చెప్పారు.  

బాధ్యులెవరు..? 
► ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌తో ఈ నెల 11న గాంధీ ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లిపోయిన తిరుపతమ్మ దాదాపు వారం రోజుల తర్వాత నారాయణగూడ ఠాణా పరిధిలో గురువారం దొరికింది. ఓ దుకాణాదారుడి ద్వారా ఈమెకు సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తూ ఆమె వెళ్లి వివరాలు సేకరించి గుర్తించారు.  
► ఇన్ని రోజులూ రోడ్లపైనే ఆమె నివాసం సాగింది. ఈ నేపథ్యంలో జరగరానిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ముషీరాబాద్‌ పోలీసులదే అయ్యేది. నగర పోలీసు విభాగంలో ఉత్తమ పనితీరు కనబరుస్తూ వారిని నిత్యం ఉన్నతాధికారులు రివార్డులు అందించి ప్రోత్సహిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తిరుపతమ్మ ఉదంతంలో ముషీరాబాద్‌ పోలీసులపై మాత్రం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం, అసలు విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు