ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?

14 Oct, 2022 03:17 IST|Sakshi

‘ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌’కేసులో దర్యాప్తు ముమ్మరం 

విదేశాలకు నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించిన సాహిల్‌ 

కమీషన్ల కోసం నిబంధనలకు విరుద్ధంగా కరెన్సీ మార్పిడి 

జ్యుడీషియల్‌ రిమాండ్‌కు 9 మంది నిందితులు 

సాక్షి, హైదరాబాద్‌: కాంబోడియా కేంద్రంగా చైనీయులు సాగించిన ‘ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌’కేసులో హైదరాబాద్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మొత్తం పది మంది నిందితులు ఉండగా.. ఒకరికి ఢిల్లీలోనే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చైనా, తైవాన్‌ జాతీయులు సహా మిగతా తొమ్మిది మందిని గురువారం కోర్టులో హాజరుపర్చి, జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

ఈ వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్న సన్నీ, సాహిల్‌లు హవాలా మార్గంలో దుబాయ్‌కు రూ.903 కోట్లు పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో సన్నీ ద్వారా వెళ్లిన డబ్బు వరుణ్‌ అరోరా, భూపేష్‌ అరోరాలకు చేరినట్టు తేల్చారు. సన్నీని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. ఇక సాహిల్‌ హవాలా మార్గంలో పంపిన రూ.400 కోట్లు దుబాయ్‌లో ఎవరికి చేరాయన్నది ఆరా తీస్తున్నారు. కాగా.. ఈ కేసు విషయంగా హైదరాబాద్‌ ఈడీ అధికారులు గురువారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను కలిసి ఎఫ్‌ఐఆర్, ఇతర వివరాలను తీసుకున్నారు. ఐబీ అధికారులు కూడా ఫోన్‌ చేసి పలు వివరాలను తెలుసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 

కమీషన్ల కోసం నిబంధనలను పాతర వేసి.. 
భారతీయ కరెన్సీని తీసుకుని విదేశీ కరెన్సీని ఇచ్చే ‘ఆథరైజ్డ్‌ మనీ చేంజింగ్‌ (ఏఎంసీ)’సంస్థలకు రిజర్వు బ్యాంకు లైసెన్సులు ఇస్తుంది. ఈ మనీ చేంజింగ్‌ కోసం కొన్ని నిబంధనలు పెట్టింది. విదేశాలకు వెళ్లే వారికి వీసా, పాస్‌పోర్ట్‌ వంటివి పరిశీలించి నగదును విదేశీ కరెన్సీలోకి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీలో రంజన్‌ మనీ కార్ప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కేడీఎస్‌ ఫారెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థలను ఏర్పాటు చేసిన నవ్‌నీత్‌ కౌశిక్‌ ఈ నిబంధనలను పక్కనపెట్టేశాడు.

కేవలం ఇద్దరు క్లయింట్లతో ఒప్పందం కుదుర్చుకుని రూ.903 కోట్లను డాలర్లుగా మార్చి ఇచ్చాడు. ఇందుకోసం రూ.1.8 కోట్లు కమీషన్‌గా తీసుకున్నాడు. అయితే ఇంత భారీగా మనీ చేంజింగ్‌ జరుగుతున్నా.. రిజర్వు బ్యాంకు, ఈడీ వంటివి పసిగట్టలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.   

మరిన్ని వార్తలు