సునీల్‌ కనుగోలుకు నోటీసులు..

28 Dec, 2022 02:30 IST|Sakshi
మల్లు రవికి నోటీసు ఇస్తున్న పోలీస్‌ అధికారి 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. తెలంగాణ గళం పేరుతో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అయిన మీమ్స్‌ వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుకు సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41 (ఏ) కింద ఇచ్చిన నోటీసుల్లో శుక్రవారం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు.

ఈ నోటీసులను సునీల్‌ తరఫున కాంగ్రెస్‌ నేత మల్లు రవి అందుకుని సంతకం చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎం.శ్రీప్రతాప్, టి.శశాంక్, ఇషాంత్‌ శర్మ ఆదివారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా పది రోజుల సమయం కోరడంతో పోలీసులు అనుమతించారు. తుకారాంగేట్‌ ప్రాంతానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ఆర్‌.సామ్రాట్‌ ఫిర్యాదుతో గత నవంబర్‌ 24న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

దీని దర్యాప్తులో లభించిన క్లూ ఆధారంగా పోలీసులు ఈ నెల 13న రాత్రి మాదాపూర్‌లోని మైండ్‌షేర్‌ యునైటెడ్‌ ఫౌండేషన్‌లో ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. అప్పుడే ఇది కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌గా తెలిసింది. అక్కడ పట్టుబడిన ముగ్గురి విచారణలో సునీల్‌ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది. విచారణకు రాకపోతే అరెస్టు సçహా ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు