పబ్‌లో యథేచ్ఛగా మత్తు దందా... డ్రగ్‌ మారో డ్రగ్‌

4 Apr, 2022 07:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పబ్‌ సంస్కృతి జడలు విప్పుతోంది. యువతలో విష బీజాలు నాటుతోంది. రేవ్‌ పార్టీల పేరుతో రెక్కలు తొడుగుతోంది. నిబంధనలకు నీళ్లొదిలి తెల్లవార్లూ బార్‌లా తెరుచుకుంటున్నాయి. నగరంలోని కొన్ని పబ్బుల్లో చాపకింద నీరులా డ్రగ్స్‌ దందా కొనసాగుతున్నట్లు తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా రాడిసన్‌ బ్లూ హోటల్‌ ఉదంతం వెలుగులోకి రావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

పబ్బుల్లో యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఆబ్కారీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సైతం  ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో వందకు పైగా పబ్బులు ఉన్నాయి. అన్ని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు అనుమతిచ్చినట్లుగానే ఎక్సైజ్‌శాఖ పబ్బులకు సైతం లైసెన్సులు ఇచ్చింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు  ఉండే నిబంధనలే వీటికీ వర్తిస్తాయి. గ్రేటర్‌ పరిధిలో  అర్ధరాత్రి 12 గంటల వరకు, వీకెండ్స్‌లో మాత్రం అర్ధరాత్రి  ఒంటిగంట వరకు అనుమతినిస్తారు. కానీ కొన్ని పబ్బులు  నిబంధనలు ఉల్లంఘించి తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నాయి. ఇలాంటి పబ్‌లపై ఎక్సైజ్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.    

కొరవడిన నిఘా... 

  • సాధారణంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల నిర్వహణపై నిఘా ఉన్నట్లుగానే పబ్‌లపైనా ఎక్సైజ్‌ అదికారులు నిఘా కొనసాగించాలి. తరచుగా తనిఖీలు నిర్వహించాలి. కొన్ని ప్రత్యేక సందర్భా ల్లో ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. కొన్ని పబ్‌లపై ఆ మాత్రం కేసులు కూడా నమోదు చేయడం లేదు. 
  • మైనర్‌లను పబ్బుల్లోకి అనుమతించడం, నిర్ణీత వేళలను పాటించకపోవడం, సరైన లెక్కలు చూపించకుండా  ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు  చెప్పారు. డ్రగ్స్‌ వాడకంపై మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు. డ్రగ్స్‌ వాడకంపై రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నమోదైన కేసు మాత్రమే మొట్టమొదటిది కావడం గమనార్హం. 
  • ప్రత్యేకమైన కేటగిరీ లేదు.. 
  • ‘ఎక్సైజ్‌ శాఖ నిబంధనల మేరకు  పబ్‌లు అనే  ప్రత్యేకమైన కేటగిరీ లేదు. హోటల్, రెస్టారెంట్‌ సదుపాయం ఉన్న చోట పెగ్గుల రూపంలో మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్‌ శాఖ లైసెన్సు ఇస్తుంది. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో బార్‌లను పబ్బులుగా  పిలుస్తారు.  ఆ సంస్కృతిలో భాగంగానే హైఫై బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు  పబ్‌లుగా కొనసాగుతున్నాయి’ అని ఓ అధికారి వివరించారు. ఈ పబ్బులన్నీ రూ.40 లక్షల బార్‌ లైసెన్సు ఫీజు చెల్లించి అనుమతి పొందినవే కావడం గమనార్హం. 

స్టార్‌ హోటళ్లకు ప్రత్యేక అనుమతి.. 
ఫోర్‌ స్టార్‌ కంటే ఎక్కువ కేటగిరీకి చెందిన హోటళ్లలో మాత్రం 24 గంటలు మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అనుమతినిస్తోంది. ఇందుకోసం హోటల్‌ నిర్వాహకులు సాధారణ బార్‌ లైసెన్సు ఫీజు రూ.40 లక్షలపై 25 శాతం అదనంగా  చెల్లించాలి. అంటే సుమారు రూ.14 లక్షలకుపైగా చెల్లించి  ప్రత్యేక అనుమతిని తీసుకోవాల్సిఉంటుంది. రాడిసన్‌ బ్లూ హోటల్‌  ఈ కేటగిరీ కిందనే ప్రత్యేక అనుమతిపై 24 గంటల పాటు మద్యం విక్రయిస్తోంది. నగరంలో ఇలాంటి అనుమతి కలిగినవి 20కిపైగా ఉన్నట్లు అధికారులు  తెలిపారు. 

(చదవండి: పబ్స్‌పై డ్రగ్స్‌ పడగ)

మరిన్ని వార్తలు